
2026లో కొత్త శిఖరాలకు భారత్-ఈయూ బంధం: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
యూరప్ పర్యటనలో పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ 2026లో భారతదేశం-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దేశాలు కేవలం ప్రమాదాలను తగ్గించుకోవడం కాకుండా, నమ్మదగిన మిత్రదేశాలతో మరింత బలమైన భాగస్వామ్యాలను నిర్మించుకోవాలని చూస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఒకరికొకరు మరింత దగ్గర అవుతున్నాయని స్పష్టం చేశారు.
లక్సెంబర్గ్‌లో భారతీయ సమాజంతో జైశంకర్ మాట్లాడుతూ.. 2026 నాటికి భారత్-యూరప్ సంబంధాల్లో గొప్ప పురోగతి కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఐరోపా దేశాలతో బంధాన్ని బలోపేతం చేసేందుకు భారత్ మరింత సమయం, శక్తిని వెచ్చించబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈయూతో సంబంధాలను విస్తరించడంలో లక్సెంబర్గ్ కీలక పాత్ర పోషించగలదని ఆయన పేర్కొన్నారు.
లక్సెంబర్గ్ ప్రధానితో జైశంకర్ భేటీ
లక్సెంబర్గ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లూక్ ఫ్రైడెన్, విదేశాంగ మంత్రి జేవియర్ బెటెల్‌తో జైశంకర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లక్సెంబర్గ్‌లో జరిగిన ప్రతి సమావేశంలోనూ భారతీయ సమాజంపై ప్రశంసలు విన్నానని జైశంకర్ తెలిపారు. రాజకీయ, వ్యాపార, సాంకేతిక రంగాల్లో భారత్-లక్సెంబర్గ్ భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు. ఈయూతో భారత్ కుదుర్చుకోబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు కూడా చాలా ముందడుగు దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
డిజిటల్, అంతరిక్ష రంగాల్లో పురోగతి
భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుపై యూరప్ దేశాల్లో ఆసక్తి పెరుగుతోందని జైశంకర్ చెప్పారు. లక్సెంబర్గ్‌కు ఉపగ్రహ రంగంలో ఉన్న అనుభవాన్ని భారత్ గౌరవిస్తోందని, అదే సమయంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కూడా వారు గమనిస్తున్నారని తెలిపారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడిన జైశంకర్, సుంకాలు మాత్రమే కాదు, ప్రమాణాలు, నిబంధనలు, పేపర్ వర్క్ కూడా పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఇలాంటి క్లిష్టతల వల్లే వాణిజ్య ఒప్పందాలు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని అన్నారు.
ఇటీవలి కాలంలో భారత్ అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, గత నెల ఒమాన్‌తో ఒక ఒప్పందం కుదిరిందని, న్యూజిలాండ్‌తో మరో ఒప్పందాన్ని పూర్తి చేసినట్లు జైశంకర్ తెలిపారు. ఇవి చిన్న ఒప్పందాలైనా, ప్రతి ఒప్పందం భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు తెస్తోందని ఆయన పేర్కొన్నారు. లక్సెంబర్గ్‌లోని భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలుపుతూ, వారు నిర్మించిన మంచి పేరు, ప్రతిష్ఠపై తనకు గర్వంగా ఉందని జైశంకర్ అన్నారు. భారత్–లక్సెంబర్గ్ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో భారతీయ వలసవాసులు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.
