
2026లో అమెరికాలో జరిగే జీ20 సదస్సుకు దక్షిణాఫ్రికాను ఆహ్వానించం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2026లో అమెరికా అధ్యక్షతన ఫ్లోరిడాలోని మయామిలో జరగబోయే జీ20 శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికాను ఆహ్వానించబోమని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా ఏ అంతర్జాతీయ సభ్యత్వానికీ అర్హత లేని దేశంగా నిరూపించుకుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన సోషల్ మీడియా వేదికైన 'ట్రూత్ సోషల్'లో వెల్లడించారు.
దక్షిణాఫ్రికా ప్రభుత్వం డచ్, ఫ్రెంచ్, జర్మన్ వలసదారుల వారసులైన ఆఫ్రికానర్లపై (శ్వేతజాతీయులు) జరుగుతున్న భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలను, దాడులను పట్టించుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు. అలాగే దక్షిణాఫ్రికాలో తెల్ల జాతీయుల రైతులను చంపేస్తున్నారని, వారి వ్యవసాయ భూములను పరిహారం లేకుండా బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఈ చర్యలను ఆయన జనహత్యగా అభివర్ణించారు. ఈ దారుణాలను అమెరికా మీడియా దాచిపెడుతోందని ఆరోపిస్తూ, ముఖ్యంగా 'న్యూయార్క్ టైమ్స్' పత్రికపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దానిని 'ఫేక్ మీడియా' అని, త్వరలో మూతపడనున్న రాడికల్ లెఫ్ట్ మీడియా అని విమర్శించారు.
ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2025 జీ20 సదస్సు ముగింపులో, అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి వచ్చిన తమ రాయబార కార్యాలయం సీనియర్ ప్రతినిధికి జీ20 ప్రెసిడెన్సీని అప్పగించడానికి దక్షిణాఫ్రికా నిరాకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్య అమెరికాను అవమానించినట్లేనని ట్రంప్ భావించారు. ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకునే 2026 జీ20 సదస్సుకు దక్షిణాఫ్రికాకు ఆహ్వానం పంపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
దక్షిణాఫ్రికాపై రాజకీయ ఒత్తిడిని పెంచేందుకు, ఆ దేశానికి ఇచ్చే అన్ని చెల్లింపులు, సబ్సిడీలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ఆదేశించారు. శ్వేతజాతీయుల రైతుల పట్ల వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై ట్రంప్ గత ఫిబ్రవరిలోనే దక్షిణాఫ్రికాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఇతర చెల్లింపులు, సబ్సిడీలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా అగ్రరాజ్యం ఇదే కఠిన వైఖరిని కొనసాగించనున్నట్లు స్పష్టమైంది.
దక్షిణాఫ్రికా స్పందనిదే
ట్రంప్ ప్రకటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్పందిస్తూ, ఈ చర్య "విచారకరం" అని అన్నారు. దక్షిణాఫ్రికా ప్రెసిడెన్సీ ఒక అధికారిక ప్రకటనలో ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టింది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సదస్సు చాలా విజయవంతం అయిందని, హాజరైన దేశాధినేతలంతా ప్రశంసించారని తెలిపారు. అమెరికా సదస్సుకు హాజరు కాకపోయినా, జీ20 అధ్యక్ష పదవికి సంబంధించిన పత్రాలను తమ విదేశాంగ శాఖ కార్యాలయంలో అమెరికా రాయబార కార్యాలయ అధికారికి సక్రమంగా అప్పగించడం జరిగిందని స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జీ20లో వ్యవస్థాపక సభ్య దేశం అని, ఇది సార్వభౌమాధికారం కలిగిన దేశమని నొక్కి చెప్పింది. తమ దేశ సభ్యత్వం లేదా అర్హత గురించి మరొక దేశం అవమానకరంగా మాట్లాడటాన్ని తాము అంగీకరించబోమని పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా జోహన్నెస్‌బర్గ్ సదస్సును అభినందించారని గుర్తుచేసింది. తప్పుడు సమాచారం, వక్రీకరణల ఆధారంగా ట్రంప్ తమ దేశంపై ప్రతికూల చర్యలను కొనసాగించడం విచారకరం అని పేర్కొంటూనే, తాము జీ20లో పూర్తి, చురుకైన సభ్య దేశంగా కొనసాగుతామని స్పష్టం చేసింది.
