
2025: సంచలన నేరాలతో వణికిన ఢిల్లీ
ఢిల్లీ పోలీసులకు అత్యంత సవాలుతో కూడిన ఏడాదిగా 2025 సంవత్సరం నిలిచింది. రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన ఘోర కారు బాంబు పేలుడు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట, వరుస బాంబు బెదిరింపులు, సంచలనాత్మక నేరాలు ఇవన్నీ కలిసి నగర పోలీసు వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఈ దారుణాలు పోలీసుల పనితనానికి సవాళ్లుగా నిలిచాయి.
రెడ్ ఫోర్ట్ బాంబు పేలుడు – ఏడాది అతిపెద్ద విషాదం
నవంబర్ 10న జరిగిన రెడ్ ఫోర్ట్ సమీపంలో కారు బాంబు పేలుడు ఈ ఏడాది అతిపెద్ద విషాదంగా నిలిచింది. దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, డజను మందికి పైగా గాయపడ్డారు. చాంద్ నీ చౌక్–లాల్ ఖిల్లా ప్రాంతం మొత్తం మానవ శరీర అవశేషాలతో నిండిపోయింది. మెట్రో స్టేషన్ మూసివేశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా, తరువాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్టులు వేగంగా జరిగాయి. దీని వెనుక ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ ను దర్యాప్తు విభాగం బయటపెట్టింది.
రైల్వే స్టేషన్ తొక్కిసలాట – బహిర్గతమైన మౌలిక సదుపాయాల లోపాలు
ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు 14, 15కు వెళ్లే ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌పై జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌లో ప్రయాణికుల నిర్వహణ, మౌలిక వసతుల లోపాలు ఈ ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యమంత్రి పై దాడి – భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు
ఆగస్టు 20న ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్ ప్రాంతంలో నిర్వహించిన జన్ సున్వాయి కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. గుజరాత్‌కు చెందిన సక్రియా రాజేశ్‌భాయి ఖిమ్జీభాయి భద్రత వ్యవస్థను దాటుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తరువాత వీఐపీ భద్రతపై సమీక్ష చేపట్టి, ముఖ్యమంత్రికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిందితుడిపై హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదు అయ్యాయి.
‘డాక్టర్ డెత్’ అరెస్ట్ – సంచలన నిజాలు
మే నెలలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన అత్యంత సంచలన నేరస్తుడు ‘డాక్టర్ డెత్’గా పేరుగాంచిన దేవేందర్ శర్మ (67). ఇతడు ఆయుర్వేద వైద్యుడిగా వైద్య సేవలు చేస్తూ, వచ్చిన రోగులతో ఆర్థిక లావాదేవీలతో నమ్మించి, వారితో విబేధాలు పెట్టుకుని దారుణంగా చంపేశాడు.
గురుగ్రామ్, ఢిల్లీలో పలు హత్యలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న అతడు పెరోల్ మీద పారిపోయి రాజస్థాన్‌లోని దౌసా ఆశ్రమంలో పూజారిగా జీవిస్తున్నాడు. దర్యాప్తులో అతడు తన బాధితులను మొసళ్లకు ఆహారంగా పెట్టినట్లు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నకిలీ గాడ్‌మాన్‌పై లైంగిక వేధింపుల కేసు
అధ్యాత్మికత ముసుగులో స్వామి చైతన్యానంద సరస్వతి అనే స్వయం ప్రకటిత గాడ్‌మాన్‌పై 16–17 మంది మహిళా విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. దక్షిణ పశ్చిమ ఢిల్లీలోని ఒక విద్యాసంస్థ మేనేజ్‌మెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఇతడిపై కేసు తీవ్ర రాజకీయ, సామాజిక చర్చకు దారి తీసింది.
పోలీసులకు సవాల్ విసిరిన బాంబు బెదిరింపులు
ఈ ఏడాది పాఠశాలలు, ఆసుపత్రులు, కాలేజీలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన సుమారు 150కి పైగా నకిలీ బాంబు బెదిరింపులు ఏడాది పొడవునా పోలీసులకు తలనొప్పిగా మారాయి. వీపీఎన్ లు ఉపయోగించి పంపుతున్న ఈ మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
వీధి నేరాలు – భద్రతపై ఆందోళన
ఆగస్టులో చాణక్యపురిలో కాంగ్రెస్ ఎంపీ ఆర్. సుధాపై చైన్ స్నాచింగ్ జరగడం కలకలం రేపింది. 48 గంటల్లోనే పోలీసులు నిందితుడు సోహన్ రావత్‌ను అరెస్ట్ చేసి, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే 26 క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడైంది.
పోలీస్ కమిషనర్ల మార్పులు – వేగవంతమైన పరిణామాలు
పోలీస్ చీఫ్ సంజయ్ అరోరా రిటైర్‌మెంట్ తరువాత నియమితులైన ఎస్బీకే సింగ్ కేవలం 21 రోజుల్లోనే డీజీ ప్రిజన్స్‌గా బదిలీ అయ్యారు. తదుపరి కమిషనర్‌గా నియమితులైన సతీష్ గోల్ఛా హయాంలో నేరస్తుల ఎన్‌కౌంటర్లు పెరిగాయి. అక్టోబర్ 23న రోహిణిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బిహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు.
ఇతర విషాద ఘటనలు
జూలై 12న ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలి, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు.
ముందున్న దారి
2025 సంవత్సరం ఢిల్లీ పోలీసుల సంక్షోభ నిర్వహణ, దర్యాప్తు సామర్థ్యం, ప్రజల విశ్వాసం అన్నింటినీ పరీక్షించింది. 2026లో కీలక ప్రాంతాల్లో భద్రత పెంపు, ప్రమాదకర నేరస్తులపై కఠిన చర్యలు, మెరుగైన పట్టణ భద్రతా వ్యవస్థలపై దృష్టి సారించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
