Let's talk: editor@tmv.in
2025: దూసుకెళ్లిన భారతీయ రైల్వే

2025: దూసుకెళ్లిన భారతీయ రైల్వే

Pinjari Chand
29 డిసెంబర్, 2025

దేశవ్యాప్తంగా వేగవంతమైన రైళ్లు, విమానాశ్రయ తరహా స్టేషన్లు, ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థలు, ప్రపంచ స్థాయి ఫ్రైట్ కారిడార్లతో 2025లో భారతీయ రైల్వేలు సంప్రదాయ రవాణా వ్యవస్థ నుంచి భవిష్యత్‌కు సిద్ధమైన నెట్‌వర్క్‌గా రూపాంతరం చెందాయి. 2025లో భారతీయ రైల్వేలు భద్రత, వేగం, సౌకర్యం, స్వదేశీ సాంకేతికత, ఆధునిక మౌలిక వసతుల సమ్మేళనంతో రైలు ప్రయాణానికి కొత్త నిర్వచనం ఇచ్చాయి. వందే భారత్, అమృత్ భారత్ వంటి ఆధునిక రైళ్ల విస్తరణ, విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో స్టేషన్ల పునర్వికాసం, ‘కవచ్’ వంటి స్మార్ట్ భద్రతా వ్యవస్థల అమలు, రికార్డు స్థాయి ఫ్రైట్ రవాణాతో 2025 భారతీయ రైల్వేలలో ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది.

భారతీయ రైల్వేల చరిత్రలో 2025 సంవత్సరం ఒక కీలక మలుపుగా నిలిచింది. సాధారణ ప్రయాణికుడిని కేంద్రంగా పెట్టుకుని భద్రత, వేగం, సౌకర్యం, ఆధునిక సాంకేతికత, స్వదేశీ ఉత్పత్తి (ఆత్మనిర్భర్ భారత్) లక్ష్యాలతో భారతీయ రైల్వేలు భారీ పురోగతిని సాధించాయి. 2026లోకి అడుగుపెడుతున్న వేళ, రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు బలమైన పునాదులు వేశారు.

సౌకర్యానికి కొత్త అర్థం–ఆధునిక రైళ్ల వేగం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 164 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కేవలం 2025 సంవత్సరంలోనే 15 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభించారు. త్వరలోనే ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్ రైలు సుదూర రాత్రి ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. వేగం, సౌకర్యం, ఆధునిక సదుపాయాల సమ్మేళనంతో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. సామాన్య ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లు (పూర్తిగా నాన్-ఏసీ) 2025లో మరింత విస్తరించాయి. ఈ ఏడాది 13 కొత్త అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం కాగా, మొత్తం సేవల సంఖ్య 30కు చేరింది. ఇవి తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి.

అలాగే తక్కువ, మధ్య దూర ప్రయాణాల కోసం రూపొందించిన నమో భారత్ ర్యాపిడ్ రైల్ సేవలు భుజ్–అహ్మదాబాద్, జయనగర్–పట్నా మార్గాల్లో ప్రారంభమై ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తున్నాయి.

ప్రత్యేక రైళ్లు – కుంభమేళాకు విస్తృత సేవలు

ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు 2025లో భారతీయ రైల్వేలు 43,000కిపైగా ప్రత్యేక రైళ్లను నడిపాయి. మహా కుంభమేళా కోసం మాత్రమే 17,340 ప్రత్యేక రైళ్లు, హోలీ, వేసవి సెలవులు, ఛఠ్ పూజ సందర్భాల్లో వేల సంఖ్యలో రైళ్లు నడిపి దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఉపశమనం కల్పించాయి.

ట్రాక్ అభివృద్ధి – వేగవంతమైన, సురక్షిత ప్రయాణానికి పునాది

2025లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయ పురోగతి సాధించింది. 900 కి.మీకి పైగా కొత్త ట్రాక్‌లు కమిషన్ చేశారు. 6,880 కి.మీ రైళ్ల రిన్యువల్, 7,051 కి.మీ పూర్తి ట్రాక్ పునరుద్ధరణ, 599 కి.మీ మార్గాల్లో 130 కిమీ/గం వేగాన్ని అమలు చేశారు. గత 11 ఏళ్లలో మొత్తం 34,428 కి.మీ కొత్త రైల్వే లైన్లు నిర్మించడం ద్వారా రోజుకు సగటు 8.57 కి.మీ ట్రాక్ వేసిన రికార్డు నెలకొల్పింది.

భద్రత – తగ్గిన ప్రమాదాలు

భద్రత విషయంలో భారతీయ రైల్వేలు చరిత్రాత్మక విజయాన్ని సాధించాయి. 2004–14లో సగటున ఏటా 171 తీవ్ర రైలు ప్రమాదాలు జరిగితే, 2025–26లో (నవంబర్ వరకు) కేవలం 11 మాత్రమే అయ్యాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ ‘కవచ్ 4.0’ను 738 రూట్ కిలోమీటర్లలో అమలు చేశారు. ఇది లోకో పైలట్ తప్పిదాలను నివారిస్తూ ప్రమాదాలను అడ్డుకుంటోంది. అలాగే, 1,731 స్టేషన్లు, 11,953 కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు అమర్చారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం – విమానాశ్రయ తరహా సౌకర్యాలు

దేశవ్యాప్తంగా 1,337 స్టేషన్లను మళ్లీ కొత్తగా నిర్మించడానికి ఎంపిక చేయగా, 155 స్టేషన్లు పూర్తిగా ఆధునీకరణను సాధించాయి. లిఫ్టులు, ఎస్కలేటర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, డిజిటల్ సైన్‌బోర్డులు, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులు – దేశాన్ని కలుపుతున్న ఇంజినీరింగ్ అద్భుతాలు

• చెనాబ్ బ్రిడ్జ్ – ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్

• ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే లింక్ (యూఎస్బీఆర్ఎల్) – కాశ్మీర్‌కు ఆల్ వెదర్ కనెక్టివిటీ

• బైరాబీ–సైరాంగ్ లైన్ – మిజోరాం తొలిసారి రైల్వే మ్యాప్‌లో

• న్యూ పాంబన్ బ్రిడ్జ్ – భారత్‌లో తొలి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన

ఫ్రైట్ రంగంలో ప్రపంచ స్థాయి ఎదుగుదల

భారతీయ రైల్వేలు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఫ్రైట్ క్యారియర్గా అవతరించాయి. 2025–26లో 1 బిలియన్ టన్నుల ఫ్రైట్ లోడింగ్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లపై రోజుకు 400కిపైగా రైళ్లు, 25 గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభం, వాగన్ ఉత్పత్తిలో రికార్డు – 2024–25లో 41,929 వాగన్లుగా ఉంది.

గ్రీన్–డిజిటల్ రైల్వేలు

• 2,626 సోలార్ పవర్డ్ స్టేషన్లు

• 898 మెగావాట్ల సౌర విద్యుత్

• 6,117 స్టేషన్లలో ఉచిత వైఫై

ప్రయాణికుల కోసం రైల్ వన్ యాప్ – టికెటింగ్ నుంచి క్యాటరింగ్ వరకు అన్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.

2026పై ఆశలు

2025లో సాధించిన విజయాలు 2026కు బలమైన పునాదిని వేశాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు, మరింత మెరుగైన ఆధునిక స్టేషన్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు, గ్రీన్ రైల్వే లక్ష్యాలతో భారతీయ రైల్వేలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ రైల్వేలు వేగవంతమైన, సురక్షితమైన, పర్యావరణహిత రవాణా వ్యవస్థను అందించాలన్న తన సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.

రైల్వే ప్రయాణికుల భద్రతలో కీలక పాత్ర: ఆర్ఫీఎఫ్ ప్రధాన ఆపరేషన్లు

ప్రయాణికుల భద్రత, సహాయం, నమ్మకాన్ని పెంపొందించే దిశగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్ ) 2025లో విశేషంగా పనిచేసింది. నిరంతర సహాయం, మహిళలు–పిల్లల రక్షణ, మానవ అక్రమ రవాణా నిరోధం, మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు వంటి అనేక ఆపరేషన్ల ద్వారా ఆర్ఫీఎఫ్ ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసింది.

నిరంతర ప్రయాణికుల సహాయం

2025 (నవంబర్ వరకు) కాలంలో ఆర్ఫీఎఫ్ : ట్విట్టర్ ద్వారా 54,648 ఫిర్యాదులు, హెల్ప్‌లైన్ 182/139 ద్వారా 3,21,557 ఫిర్యాదులు తీసుకుంది. మొత్తం 3,76,205 ప్రయాణికుల ఫిర్యాదులకు స్పందించింది. ఇది ఆర్ఫీఎఫ్ ఎంత వేగంగా స్పందించిందో తెలియజేస్తోంది.

‘నన్హే ఫరిష్తే’ – పిల్లల రక్షణ

పిల్లల సంరక్షణ, రక్షణ కోసం నిర్వహించిన ‘ఆపరేషన్ నన్హే ఫరిష్తే’ కింద 17,231 బాలలను రక్షించి, సంరక్షణ కేంద్రాలకు అప్పగించారు. రైల్వే ప్రాంగణాల్లో ప్రమాదాల సమయంలో 1,894 పురుషులు, 974 మహిళలు, మొత్తం 2,868 మంది ప్రాణాలను ఆర్ఫీఎఫ్ కాపాడింది.

‘ఆపరేషన్ అమానత్’

ప్రయాణికులు మరిచిపోయిన వస్తువులను తిరిగి వారికే అప్పజెప్పింది. ఇలా 53,607 కేసుల్లో సామాను తిరిగి వారికి చేర్చింది. వాటి మొత్తం విలువ రూ. 79.85 కోట్లకు పైగా ఉంటుంది.

‘మాతృశక్తి’ – గర్భిణీ మహిళలకు ప్రసవ సమయంలో సహాయం అందించింది. రైళ్లలో 198 సందర్భాల్లో, స్టేషన్లలో 105, మొత్తం 303 ప్రసవ సందర్భాల్లో ఆర్పీఎఫ్ సహకారం అందించింది.

మహిళా భద్రత – అనధికార ప్రవేశాలపై కఠిన చర్యలు

మహిళలకు కేటాయించిన కోచ్‌లలో ఇతరులు ప్రవేశించడంపై 1,07,606 కేసులు నమోదు చేసి, 1,10,940 మందిని అరెస్ట్ చేసింది.

‘ఉపలబ్ధ్’ టికెట్ దళారులపై 2,449 కేసులు నమోదు చేసి, 2,690 అరెస్టులు, వారి నుంచి 7,974 భవిష్యత్ ప్రయాణ టికెట్లు స్వాధీనం చేసుకుంది. వాటి విలువ రూ. 1.98 కోట్లు గా ఉంటుంది. 8,905 ఐఆర్సీటీసీ యూజర్ ఐడీలు బ్లాక్ చేసింది.

10,146 మందికి వీల్‌చెయిర్లు, స్ట్రెచర్లు, వైద్య సహాయం, అంబులెన్స్, శిశు ఆహారం వంటి సేవలు రైల్వే అందించింది.

‘ఏఏహెచ్టీ’ – మానవ అక్రమ రవాణా నిరోధం

978 అక్రమ రవాణా బాధితులు రక్షించి, 292 అక్రమ రవాణాదారులు అరెస్ట్ చేసింది. బాలురు, బాలికలు, మహిళలు, పురుషులు అందరూ ఇందులో ఉన్నారు. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా పై కూడా కఠిన చర్యలు చేపట్టింది. 1,980 కేసులు గుర్తించి, రూ. 2,085 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకోంది. 1,601 మందిని అరెస్ట్ చేసింది.

వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా 43 ఫౌనా కేసులు, 19 ఫ్లోరా కేసులు, మొత్తం 44 అరెస్టులు చేసింది.

పొగాకు: 140 కేసులు, విలువ రూ. 8.25 కోట్లు, 97 అరెస్టులు

మద్యం: 4,044 కేసులు, విలువ రూ. 6.01 కోట్లు, 3,356 అరెస్టులు చేసింది.

2025: దూసుకెళ్లిన భారతీయ రైల్వే - Tholi Paluku