
2025: జెన్-జీ నిరసనలతో కూలిన నేపాల్ ప్రభుత్వం
ప్రస్తుతం ఆసియా ఖండంలో, ముఖ్యంగా పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు దీనికి ప్రధాన కారణం. అక్కడ కూడా కేవలం విద్యార్థులు జెన్-జీ (Gen-Z) యువత కలిసి దశాబ్దాల కాలంగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టారు. సరిగ్గా అదే తరహాలో నేపాల్‌లో కూడా యువత తిరగబడితే ఎలా ఉంటుందనే విశ్లేషణలు ఇప్పుడు పెరిగాయి.
అవినీతి, బంధుప్రీతి, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా 'జెన్-జీ' (యువతరం) చేపట్టిన భారీ నిరసనలు హింసాత్మకంగా మారడంతో 2025లో నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ పరిణామాలు చివరకు ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పతనానికి దారితీశాయి.
సెప్టెంబర్‌లో చోటుచేసుకున్న ఈ రాజకీయ అలజడి నేపథ్యంలో, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇది తాత్కాలిక ప్రభుత్వం మాత్రమే. షెడ్యూల్ ప్రకారం 2027లో జరగాల్సిన ఎన్నికలను ఏడాది ముందే, అంటే 2026 మార్చి 5న నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు.
నిరసనలకు కారణాలు:
డిజిటల్ అసమ్మతి:
రాజకీయ నాయకుల పిల్లలు ("నెపో కిడ్స్") ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం చివరకు వీధుల్లోకి చేరింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన ప్రదర్శనల్లో కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహించిన నిరసనకారులు పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం, సుప్రీంకోర్టు వంటి కీలక ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు.
రాజరికం కోసం డిమాండ్:
దేశం గణతంత్రంగా మారిన దశాబ్దం తర్వాత, మళ్లీ రాజరికాన్ని, హిందూ దేశాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మార్చి నెలలో జరిగిన నిరసనల్లో ఇద్దరు మరణించారు. నేపాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఒక రకమైన అస్థిరత ఉంటుంది. అక్కడ ప్రధానులు త్వరగా మారుతుంటారు. యువతలో రాజకీయ నాయకులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నేతల పిల్లలు విలాసవంతమైన జీవితం గడపడం, సామాన్యులకు ఉపాధి లేకపోవడం వల్ల యువతలో ఆవేదన పెరిగింది.
సోషల్ మీడియా శక్తి
జెన్-జీ అంటేనే ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగిన తరం. ప్రభుత్వం సోషల్ మీడియాపై (ఉదాహరణకు టిక్‌టాక్ వంటివి) ఆంక్షలు విధించినప్పుడు, అది వారి వాక్ స్వాతంత్య్రాన్ని హరించడంగా యువత భావిస్తుంది. డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా వీరు చాలా తక్కువ సమయంలో లక్షల మందిని సమీకరించగలరు. అందుకే ‘జెన్ జీ' అంశం చర్చకు వస్తోంది.
ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు
నేపాల్‌లో చైనా ప్రభావం పెరగడం, భారత్‌తో సరిహద్దు వివాదాలు రావడం వంటి అంశాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యువత దేశం యొక్క సార్వభౌమాధికారం అభివృద్ధి విషయంలో పాత తరం నేతల కంటే భిన్నంగా ఆలోచిస్తోంది. పాత తరం రాజకీయ నాయకుల పద్ధతులు నచ్చని యువత (Gen-Z), సోషల్ మీడియా ఆయుధంగా దేశ రాజకీయాలనే మార్చేయగలరని నిరూపించడానికి ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
భారత్ - నేపాల్ సంబంధాలు:
ప్రధానిగా ఉన్న సమయంలో కె.పి. శర్మ ఓలీ చైనా అనుకూల వైఖరిని ప్రదర్శించారు. తన పదవీ కాలంలో భారత్‌ను సందర్శించని మొదటి నేపాల్ ప్రధానిగా ఆయన నిలిచారు. కాలాపానీ, లిపిలేఖ్, లింపియాధురా వంటి భారత భూభాగాలను తమవిగా చూపుతూ రూ.100 నోటును నేపాల్ విడుదల చేయడం భారత్‌ను ఆగ్రహానికి గురిచేసింది. భారత్-చైనా మధ్య ఈ ప్రాంతం ద్వారా వాణిజ్యం పునరుద్ధరించడాన్ని నేపాల్ వ్యతిరేకించింది. అయితే ఇది 1954 నుండి కొనసాగుతున్నదని భారత్ స్పష్టం చేసింది.
సానుకూల అంశాలు:
జూన్ నెలలో భారత యాత్రికులకు కైలాస మానస సరోవర యాత్రకు నేపాల్ అనుమతించింది. అలాగే, భారత ట్రాన్స్‌మిషన్ లైన్ ద్వారా నేపాల్ 40 మెగావాట్ల విద్యుత్తును బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడం ప్రారంభించింది.
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అంశాలు:
ఏడాది ఆరంభంలో 7 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూలై, అక్టోబర్ నెలల్లో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సుమారు 70 మందికి పైగా మరణించారు. భారత్ తక్షణమే స్పందించి సహాయక సామగ్రిని, వంతెనలను పంపిణీ చేసింది. ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నేపాల్ పౌరుడు సుదీప్ నౌపానీతో సహా 26 మంది మరణించారు.
రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ, నేపాల్‌లో పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి భారత్ తన సహాయాన్ని కొనసాగించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు ఇటీవల కేర్ టేకర్ ప్రధాని కార్కిని కలిసి 2026 ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
