Let's talk: editor@tmv.in
2025 ఏప్రిల్–అక్టోబర్ లో నాన్ పెట్రోలియం ఎగుమతులు 4% పెరుగుదల, ఎగుమతి వృద్ధి కొనసాగింపు

2025 ఏప్రిల్–అక్టోబర్ లో నాన్ పెట్రోలియం ఎగుమతులు 4% పెరుగుదల, ఎగుమతి వృద్ధి కొనసాగింపు

Bavana Guntha
18 నవంబర్, 2025

అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో భారత ఎగుమతులు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2025 మధ్య వస్తువులు మరియు సేవల ఎగుమతులు 491.80 బిలియన్ డాలర్లకు చేరింది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 4.84% పెరుగుదల సాధించాయి.

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం నాన్ పెట్రోలియం ఎగుమతుల్లో సాధించిన వృద్ధి. ఇవి 3.92% పెరిగి 219.90 బిలియన్‌ డాలర్లను తాకాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఆహార ఉత్పత్తులు, సముద్రాహారంపై పెరిగిన డిమాండ్ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, సెమికండక్టర్ భాగాలు, మసాలాలు, ప్రాసెస్‌డ్ ఫుడ్, రొయ్యలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. PLI ( ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహం) పథకం, పోర్టుల సామర్థ్య పెంపు, పశ్చిమ ఆసియా–ఆఫ్రికా–లాటిన్ అమెరికా వంటి విస్తరిస్తున్న మార్కెట్లు, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు మెరుగైన అనుకూలత కూడా ఎగుమతిదారులకు బలాన్నందించాయి.

ఇక పెట్రోలియం ఎగుమతుల విషయంలో వేరే పరిస్థితి కనిపించింది. దేశం ఎక్కువ ఇంధనం ఎగుమతి చేసినప్పటికీ, గ్లోబల్ ధరలు తగ్గడం వల్ల ఎగుమతి విలువ తగ్గింది.PPAC (Planning and Analysis Cell) ప్రకారం, పరిమాణం 3–4% పెరగగా, ఆదాయం దాదాపు 7% తగ్గింది. డీజిల్, పెట్రోల్, ATF ( aviation turbine fuel) అంతర్జాతీయ ధరలు పడిపోవడం, యూరప్–ఆఫ్రికా డిమాండ్ తగ్గడం, రిఫైనింగ్ మార్జిన్లు తగ్గటం దీనికి కారణాలు.

అక్టోబర్‌లో ఎలక్ట్రానిక్స్ 19%,మాంసం–పాలు–పౌల్ట్రీ 31%,సముద్ర ఉత్పత్తులు 11%,జీడిపప్పు దాదాపు 127%,కాఫీ 11% పెరిగి బలమైన వృద్ధిని సాధించాయి

మరోవైపున, దిగుమతులు గణనీయంగా పెరగడం వల్ల వాణిజ్య లోటు విస్తరించింది. అక్టోబర్‌లో ఎగుమతులు 72.89 బిలియన్ డాలర్లు కొద్దిగా తగ్గగా, దిగుమతులు 94.70 బిలియన్ డాలర్లకు పెరిగాయి (2024లో 82.44 బిలియన్ డాలర్లు). బంగారం (8.9 బిలియన్ డాలర్లు) మరియు వెండి (2.72 బిలియన్ డాలర్లు) భారీ దిగుమతులే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా, వాణిజ్య లోటు 21.80 బిలియన్ డాలర్లకు చేరి, గత సంవత్సరం 9.05 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగింది. ఇందులో 10–12 బిలియన్ డాలర్లు పెరుగుదల పూర్తిగా బంగారం–వెండి దిగుమతుల వలననే వచ్చిందని అధికారులు తెలిపారు.

ఈ తాత్కాలిక ఒత్తిడి మధ్య, సేవా రంగం భారత వాణిజ్యానికి ప్రధాన సహాయకారిగా ఉంది . 2025 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో సేవల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరి 9–10% వృద్ధిని కొనసాగించాయి. అమెరికాకు మొత్తం ఎగుమతులు సానుకూలంగానే ఉన్నప్పటికీ, పరస్పర సుంకాల ప్రభావం ఉన్న కొన్నిరంగాల్లో అక్టోబర్‌లో స్వల్ప మందగింపు కనిపించింది. అయినప్పటికీ, సేవల రంగం బలం, మార్కెట్ విస్తరణ, విభిన్న సరుకు వర్గాల వృద్ధి దృష్ట్యా 2025 ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో కూడా ఎగుమతి గతి స్థిరంగా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.

మొత్తం మీద, నాన్ పెట్రోలియం రంగాల ఉత్సాహం, పలు పరిశ్రమల్లో స్థిరమైన డిమాండ్ కారణంగా 2025 ఆర్థిక సంవత్సరం మిగిలిన భాగంలో భారత వాణిజ్య దిశ సానుకూలంగానే కనిపిస్తోంది.