Let's talk: editor@tmv.in
2025లో లక్షకు పైగా వీసాలు రద్దు చేసిన అమెరికా

2025లో లక్షకు పైగా వీసాలు రద్దు చేసిన అమెరికా

Shaik Mohammad Shaffee
14 జనవరి, 2026

అమెరికాలో అడుగుపెట్టాలని కలలుగనే విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ భద్రతే లక్ష్యంగా సాగుతున్న ప్రక్షాళనలో భాగంగా 2025 సంవత్సరంలో ఇప్పటివరకు లక్షకు పైగా వీసాలను అమెరికా రద్దు చేసింది. ఇందులో నేరపూరిత రికార్డులు ఉన్నవారు, వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

నేరగాళ్లకు చెక్.. ‘అమెరికా ఫస్ట్’ నినాదం

"అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఇలాంటి వ్యక్తులను దేశం నుంచి బహిష్కరిస్తూనే ఉంటాం" అని అమెరికా విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. రద్దయిన వీసాలలో సుమారు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 స్పెషలైజ్డ్ వీసాలు (ఉద్యోగులకు సంబంధించినవి) ఉన్నాయని పేర్కొంది. దాడులు, దొంగతనాలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వంటి నేరాలకు పాల్పడిన విదేశీయులపై ఈ వేటు పడింది.

రద్దుకు ప్రధాన కారణాలివే

అమెరికా వీసాల భారీ రద్దుకు ప్రధానంగా అక్కడి నిబంధనలను ఉల్లంఘించడమే కారణమని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. వీసాలు కోల్పోయిన ఉద్యోగులలో సగం మంది మద్యం తాగి వాహనం నడుపుతూ (డ్రంక్ అండ్ డ్రైవ్) పట్టుబడగా, మిగిలిన వారు దాడులు, దొంగతనాలు, పిల్లలపై వేధింపులు, ఆర్థిక మోసాల వంటి నేరాల్లో నిందితులుగా ఉన్నారు. విద్యార్థుల విషయానికి వస్తే, డ్రగ్స్ వాడటం, సరఫరా చేయడం వంటి తీవ్రమైన కేసుల్లో చిక్కుకున్న సుమారు 500 మంది వీసాలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రద్దయిన ఈ మొత్తం లక్ష వీసాలలో ఎక్కువ భాగం పర్యాటక, బిజినెస్ వీసాలే ఉన్నాయి. వీరు తమకు అనుమతించిన గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా అమెరికాలోనే ఉండిపోవడం (ఓవర్ స్టే) వల్ల ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకుంది.

ముమ్మరంగా ‘సోషల్ మీడియా’ స్క్రీనింగ్

డిసెంబర్ 15 నుండి అమెరికా విదేశాంగ శాఖ వీసా దరఖాస్తుల పరిశీలనను మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా హెచ్-1బీ, హెచ్-4 (డిపెండెంట్) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలను (ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైనవి) క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల భారత్‌లో వీసా స్టాంపింగ్ కోసం వచ్చిన అనేకమంది ఉద్యోగుల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. దీనివల్ల వందలాది మంది భారతీయులు నెలల తరబడి స్వదేశంలోనే చిక్కుకుపోయి, ఉపాధి కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు.

హక్కు కాదు.. కేవలం ప్రాధాన్యత మాత్రమే!

"అమెరికా వీసా అనేది విదేశీయుల హక్కు కాదు, అది మేం ఇచ్చే ఒక గొప్ప అవకాశం మాత్రమే" అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. కొత్తగా ఏర్పాటు చేసిన 'కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్' ద్వారా విదేశీయుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తామని, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే ఎవరినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. 2024లో బైడెన్ హయాంలో రద్దయిన 40,000 వీసాలతో పోలిస్తే, ప్రస్తుతం ట్రంప్ హయాంలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.