Let's talk: editor@tmv.in
2025లో భారత్‌ నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతి

2025లో భారత్‌ నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతి

Shaik Mohammad Shaffee
6 జనవరి, 2026

భారతదేశ తయారీ రంగం సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచ ప్రసిద్ధ టెక్ సంస్థ 'యాపిల్' గడిచిన 2025 సంవత్సరంలో భారతదేశం నుండి ఏకంగా 50 బిలియన్ డాలర్ల (సుమారు 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా) విలువైన ఐఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ విజయానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమమే ప్రధాన కారణమని ఆయన తెలిపారు.

భారత్ కేవలం వస్తువులను కొనే దేశంగానే కాకుండా, తయారు చేసి అమ్మే దేశంగా మారుతోందని అశ్వినీ వైష్ణవ్ ఆనందం వ్యక్తం చేశారు. 2025లో ఒక్క ఏడాదిలోనే 50 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను ఆపిల్ భారత్‌ నుంచి ఎగుమతి చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు గర్వకారణమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ దూకుడు

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఐదేళ్లలో సామ్‌సంగ్ కంపెనీ సుమారు 17 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగుమతి చేయగా, ఆపిల్ కంపెనీ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 50 బిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. ఇది భారత తయారీ రంగం సాధించిన గొప్ప విజయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరగగా, విదేశాలకు చేసే ఎగుమతులు 8 రెట్లు పెరిగాయి. దీనివల్ల భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి అయ్యే వస్తువుల జాబితాలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఇప్పుడు టాప్-3 స్థానానికి చేరుకున్నాయి.

దేశవ్యాప్తంగా 46 ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, ఇయర్ ఫోన్లు తయారీతో ఈ రంగం తయారీ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన శక్తిగా మారిందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ ఏడాదిలోనే నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లు (చిప్ తయారీ కేంద్రాలు) వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ద్వారా ప్రస్తుతం దేశంలో సుమారు 25 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కొన్ని ఫ్యాక్టరీల్లో ఒక్కో కేంద్రంలోనే 5,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, కొన్ని చోట్ల ఈ సంఖ్య 40,000 వరకు ఉందని తెలిపారు.

మున్ముందు భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేవలం ఫోన్లు తయారు చేయడమే కాకుండా, వాటికి కావాల్సిన డిజైన్లు, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, యంత్రాలను కూడా దేశంలోనే తయారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

2025లో భారత్‌ నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతి - Tholi Paluku