
2025లో.. గాంధీ మహాత్మ అవసరమా?
అక్టోబర్ 2న, మనం మహాత్మా గాంధీ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. గాంధీ కేవలం దేశ స్వాతంత్య్రము కోసం పోరాడిన వ్యక్తిగానే కాకుండా సామాజిక ,ఆర్థిక , పర్యావరణవేత్త , తన మాటలను తానే ఆచరించి ప్రజలను తన మార్గంలో నడిపించిన వ్యక్తి. ఆయన అహింస, సత్యాగ్రహం, సాదారణ జీవనం, సమానత్వం అనే సూత్రాలతో స్వాతంత్ర్యం సాధించడంలో ప్రధాన పాత్ర వహించారు. గాంధీ ఆలోచనలు ప్రపంచ నాయకులను ఎందరినో ప్రబావితం చేశాయి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, లాంటి వారు గాందీజీ అడుగుజాడలని ఆదర్శంగా తీసుకుని తమ ఆశయాలను సాధించారు. ఆయన చూపిన ధైర్యం, ఆచరణ నేటి రాజకీయ, సామాజిక, పర్యావరణ సమస్యలకు జవాబుగా ఉంది.ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు తలకిందులవుతున్నాయి. మానసిక ఒత్తిడి, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, యుద్ధాలు, పర్యావరణ సంక్షోభాలను ప్రపంచం ఎదుర్కొంటున్నది . ఈ క్లిష్ట పరిస్థితులలో గాంధీ దార్శనికత మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
సత్యాగ్రహం, నిరాకరణ ద్వారా గాంధీ రాజకీయ వ్యూహాన్ని రూపొందించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం , 1942లో క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమాలు కోట్లాదిమంది సాధారణ భారతీయులను అహింస ద్వారా స్వాతంత్ర ఆందోళనలో పాల్గొనేలా ప్రేరేపించాయి. ఈ రోజుల్లో, ప్రపంచంలో చాలా దేశాల్లో యుద్ధాలు, అసమానత, రాజకీయ సంక్షోబాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో గాంధీ విధానాలు శాంతియుత మార్గాలు, మౌలిక హక్కుల రక్షణ మరియు పౌర భాగస్వామ్యం కోసం మార్గం చూపుతున్నాయి.
గాంధీ గారి సాధారణ జీవన శైలి, నైతిక విలువలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. స్థానిక ఉత్పత్తులు, శాకాహార జీవనం, ప్రకృతితో మమేకమవ్వడం ఆయన సూచించిన మార్గాలు . ప్రస్తుతం పర్యావరణ నాశనం ప్రపంచానికి సవాలు విసురుతున్నాయి. గాంధీ సూచించిన సరళ, సుస్థిర జీవన విధానం ప్రస్తుత సమకాలీన సమస్యలకు పరిష్కారంగా మారుతుంది. అలాగే, ఆయన సూచించిన నైతికత, నిజాయితీ ప్రజల సామాజిక నమ్మకాలను పునరుద్ధరించడానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
గాంధీ గ్రామలలో స్వరాజ్యం వెల్లివిరియాలని విశ్వసించారు . గ్రామాల్లో స్వయం పాలన, వనరుల సమాన పంపిణీ. సమానత్వం, సాంఘిక సమన్వయం కోసం ఆయన వికేంద్రీకృత ఆర్థిక సమాజాన్ని ప్రతిపాదించారు.ప్రపంచంలో పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు , కేంద్రీకృత అధికార వ్యవస్థలు, సామాజిక అసహనానికి కారణమవుతున్నాయి. గాంధీ సమాజానికి వనరుల పంపిణీ ధార్మికముగా , సమగ్ర పాలనా విధానం ఉండాలని ఆశించారు. ప్రస్తుత ప్రపంచ సమస్యలు- యుద్ధాలు, పర్యావరణ నాశనం, ఆర్ధిక అసమానత, మానసిక ఒత్తిడి గాంధీ విధానాల ద్వారా పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నాయి.
అహింస: సమాజంలో పెల్లుబికిన ఘర్షణలను తగ్గించటం, శాంతిని సృష్టించడం ప్రస్తుత పరిష్కారమార్గాలు. సరళ జీవనం: పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన అభివృద్ధి సాదించడం వైపు పయనం మన ముందున్న పరిష్కారాలు.
నైతికత, నిజాయితీ: ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం, సామాజిక సౌభ్రాతృత్వాన్నిపెంపొందించడం, వికేంద్రీకరణ,శక్తి మరియు వనరుల సమాన పంపిణీ, అసమానతను తగ్గించడం తక్షణ పరిష్కారంగా కనిపిస్తున్నాయి. చిన్నపాటి మార్పులు సమాధానాత్మక పౌర చర్యలు, సుస్థిర వినియోగం, స్వచ్ఛంద సేవలు, సమాజంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు.
క్లుప్తంగా చెప్పాలంటే గాంధీ సామాజిక దార్శనికత కలిగిన నేత. ఆయన జీవితం భావితరాలకు సముచిత మార్గం సూచిస్తుంది. సమాజంలో మార్పు అహింస, నిజాయితీ, సరళ జీవనం ,సమానత్వం ద్వారా మాత్రమే సాధ్యమని, ఈ గాంధీజయంతి నుండి మనం ఆయన సూత్రాలను గుర్తుచేసుకుని శాంతియుత, న్యాయపరమైన, సుస్థిర ప్రపంచాన్ని సాధించడానికి కృషి చేద్దాం. మహాత్మా గాంధీయే చెప్పినట్లు "మనం ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు రావాలంటే మనమే స్వయంగా గాంధీగా మారాలి"
