


2024 ఎన్నికల తీర్పు ‘రాష్ట్ర’ పునర్నిర్మాణానికి ప్రజలిచ్చిన బాధ్యత: సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల ఫలితాలు కేవలం ఒక సాధారణ రాజకీయ విజయం కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించేందుకు ప్రజలు తమకు అప్పగించిన బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా దామినీడు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం” భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు కూటమికి 57 శాతం ఓట్లతో పాటు 164 స్థానాల్లో చారిత్రాత్మక విజయాన్ని అందించి ఆశీర్వదించారని గుర్తుచేశారు. మేము పాలకులం కాదు.. ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం అని సీఎం పేర్కొన్నారు.
గత ఐదేళ్ల విధ్వంసం.. అప్పుల కుప్పగా రాష్ట్రం
2019 నుంచి 2024 వరకు సాగిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని, వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 10 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కనబెట్టారని.. పెట్టుబడిదారులను వెళ్లగొట్టడం ద్వారా యువత భవిష్యత్తును దెబ్బతీశారని మండిపడ్డారు.
అప్పట్లో అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, తనను అక్రమంగా జైల్లో పెట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ ని కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. అయినా తాము అధైర్యపడకుండా ప్రజల కోసం నిలబడ్డామన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల జీవితాలతో జూదమాడిన వారికి ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదని ఎద్దేవా చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి అపచారం చేశారని, ఇప్పుడు ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యానికి అడ్డుపడుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా అమలు
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన అవకాశాలను మళ్లీ పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తూ నష్ట నివారణ చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంక్షేమం, సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా’ కింద రూ. 65,000 కోట్ల విలువైన సంక్షేమ పెన్షన్లను అందిస్తున్నామని.. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఇప్పటివరకు 71 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20,000 పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టులను, దాదాపు 6,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రూ. 21,000 కోట్ల బకాయిలను చెల్లించామని సీఎం వెల్లడించారు.
అభివృద్ధి కేంద్రాలుగా అమరావతి, వైజాగ్, తిరుపతి
రాష్ట్రంలోని అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని.. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాలను ప్రధాన గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ను పునరుద్ధరించి, పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని తెచ్చామన్నారు. రాయలసీమ ప్రాంతంలో స్పేస్, డిఫెన్స్, డ్రోన్ పరిశ్రమలు వస్తున్నాయని, తిరుపతి జిల్లాలో ప్రముఖ బుల్లెట్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ తన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కర్నూలు జిల్లాలో త్వరలోనే బంగారు గనుల తవ్వకం పనులు ప్రారంభమవుతాయన్నారు. వైజాగ్‌కు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు వస్తుండగా.. అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచకుండా, రూ. 4,668 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించిందని స్పష్టం చేశారు.
కేంద్రం మద్దతు, ప్రధాని మోడీపై ప్రశంసలు
పోలవరం ప్రాజెక్టు, గ్రీన్ ఫీల్డ్ రాజధాని అమరావతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచిందని సీఎం చంద్రబాబు చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని.. 1.46 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులు, 160 విమానాశ్రయాలు నిర్మించబడి దేశం వేగంగా దూసుకుపోతోందని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకు త్వరలోనే 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
