Let's talk: editor@tmv.in
2011 జనగణన ఆధారంగా డిలిమిటేషన్‌ వల్ల దక్షిణాదికి నష్టమే: స్టాలిన్‌

2011 జనగణన ఆధారంగా డిలిమిటేషన్‌ వల్ల దక్షిణాదికి నష్టమే: స్టాలిన్‌

Pinjari Chand
10 ఏప్రిల్, 2026

మహిళా రిజర్వేషన్ అమలు కోసం లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచే ఉద్దేశంతో చేపట్టే డిలిమిటేషన్ ప్రక్రియను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సంస్కరణ కాదని, అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకునే ప్రయత్నమని ఆయన విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన స్టాలిన్‌, 2011 జనగణన ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే ఉత్తర భారత రాష్ట్రాలకు లోక్‌సభలో సీట్లు దాదాపు రెట్టింపు అవుతాయని, దక్షిణ భారత రాష్ట్రాల వాటా సుమారు 24 శాతానికి మాత్రమే పరిమితమవుతాయని అన్నారు. మహిళలకు లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్‌ అధినియమ్‌కు డీఎంకే వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచకుండా కూడా ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను బలహీనపరుస్తోందని స్టాలిన్ ఆరోపించారు. చర్చలు, ప్రజల ప్రతినిధిత్వానికి వేదిక కావాల్సిన పార్లమెంట్‌ను కేవలం ఆచారంగా మారుస్తున్నారని అన్నారు. సీట్ల పెంపు వల్ల ఖర్చులు పెరిగి పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని కూడా విమర్శించారు.

ఉత్తర భారతానికే ఎక్కువ స్థానాలు

రాజ్యాంగంలోని అర్టికల్‌ 1 ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా నిర్వచించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని పేర్కొన్నారు. దక్షిణాధి రాష్ట్రాలు జనాభా నియంత్రణలో సాధించిన విజయానికి ఇది శిక్షలా మారుతుందని స్టాలిన్ అన్నారు. ఉత్తర భారత రాష్ట్రాలకు అధిక సీట్లు లభిస్తే అధికార సమతౌల్యం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ , తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.

రాజకీయ స్వలాభం కోసమే ఈ సమయంలో చట్ట సవరణ

రాష్ట్రాల ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ తీసుకురావడం రాజకీయ లాభం కోసం చేసిన చర్యలా కనిపిస్తోందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉందని, అయితే అది రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉండకూడదని చెప్పారు. ఓబీసీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కూడా ఆయన విమర్శించారు. క్రీమిలేయర్ పరిమితిని పెంచకుండా ఉంచడం, 2027లో జరగనున్న కులగణన ఫలితాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు సాగడం సరైంది కాదని అన్నారు. ఇదిలా ఉండగా, మహిళా రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర మంత్రివర్గం తాజాగా సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రస్తుతం అమలుకు ముందు డిలిమిటేషన్ ప్రక్రియ అవసరమని కేంద్రం తెలిపింది.

2011 జనగణన ఆధారంగా డిలిమిటేషన్‌ వల్ల దక్షిణాదికి నష్టమే: స్టాలిన్‌ - Tholi Paluku