Let's talk: editor@tmv.in
2001 ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి పార్లమెంట్ నివాళులు

2001 ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి పార్లమెంట్ నివాళులు

Pinjari Chand
14 డిసెంబర్, 2025

2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిలో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాష్ట్రపతి ముర్ము పోస్టు చేస్తూ ‘2001లో ఈ రోజున పార్లమెంట్‌ను రక్షిస్తూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు దేశం సెల్యూట్ చేస్తోంది. వారి వీరత్వం, కర్తవ్య నిష్ఠ మన జాతీయ స్పూర్తికి మార్గదర్శకం. దేశం వారికి, వారి కుటుంబాలకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కొనేందుకు భారత్ తన సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోంది’ అని పేర్కొన్నారు.

నివాళి అర్పించిన నాయకులు

ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా 2001 పార్లమెంట్ దాడిలో ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, ప్రియాంకగాంధీ సహా పలువురు సీనియర్ పార్లమెంటేరియన్లు కూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష నేతలు కలిసి పాల్గొన్నారు.

దేశం వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీర జవాన్ల త్యాగాన్ని స్మరిస్తూ

ప్రజాస్వామ్య దేవాలయమైన భారత పార్లమెంట్ పై 2001లో ఈ రోజున జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని దేశం చూసింది. దేశ గౌరవం, సార్వభౌమత్వంపై జరిగిన ఈ దాడిలో పార్లమెంట్‌ను కాపాడుతూ ప్రాణాలు అర్పించిన అమర వీరులకు వినమ్ర నివాళులు. దేశం ఎప్పటికీ వారికి కృతజ్ఞతగా ఉంటుంది. జై హింద్! అని పేర్కొన్నారు.

కమలేష్ కుమారిని స్మరించుకున్న సీఆర్ఫీఎఫ్

అదేవిధంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్)కూడా 2001 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగి 24 సంవత్సరాలు అయిన సందర్భంగా 88వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కమలేష్ కుమారికి నివాళులు అర్పించింది. ఉగ్రదాడి సమయంలో తీవ్ర కాల్పుల మధ్య ఉగ్రవాదులను వెంబడిస్తూ, వారి కదలికలపై సహచరులకు నిరంతరం సమాచారం అందించిన ఆమె అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని సీఆర్ఫీఎఫ్ తెలిపింది. ఆమె చర్యల వల్ల ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టమని పేర్కొంది. తీవ్రంగా గాయపడిన కమలేష్ కుమారి విధి నిర్వహణలో వీరమరణం పొందారు. ఆమెకు మరణానంతరం అశోక చక్ర అవార్డు ప్రదానం చేశారు.

డిసెంబర్ 13, 2001న లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ దాడిలో ఒక పౌరుడితో పాటు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన సుమారు 40 నిమిషాల తర్వాత ఈ దాడి జరిగింది. అప్పటికి భవనంలో దాదాపు 100 మంది సభ్యులు ఉన్నారు. ఇదే రోజు లోక్‌సభ కూడా పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీస్, సీఆర్ఫీఎఫ్​ కు చెందిన అమర వీరులకు నివాళులు అర్పించింది. స్పీకర్ ఓం బిర్లా సభను నడిపిస్తూ నివాళులర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ఉగ్రవాదంపై పోరాటంలో వెనకడుగు వేయమని లోక్‌సభ మరోసారి స్పష్టం చేసింది.

2001 ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి పార్లమెంట్ నివాళులు - Tholi Paluku