
20 మెడల్స్‌తో భారత్ సునామీ… చరిత్ర సృష్టించిన భారత బాక్సర్లు
భారత్‌కు ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో రికార్డు మెడల్స్... కానీ వెనుకాల ఉన్న నిజం ఇదీ. గ్రేటర్ నోయిడాలో ముగిసిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. మొత్తం 20 మెడల్స్ (తొమ్మిది బంగారు, ఆరు రజత, ఐదు కాంస్య) సాధించి రికార్డు సృష్టించింది. కాగితంపై చూస్తే ఇది భారత బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రదర్శనల్లో ఒకటిగా కనిపిస్తోంది. అయితే ఈ మెడల్స్ వెనుక మరో కథ దాగి ఉంది.
ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన వరల్డ్ బాక్సింగ్ కప్ సిరీస్‌కు ఇది ఫైనల్ దశ. ముందు మూడు వరల్డ్ కప్‌లలో మెడల్ గెలుచుకున్నవారితో పాటు ప్రతి వెయిట్ కేటగిరీలో టాప్ ఎనిమిది ర్యాంకర్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత లభించింది. అయినా పెద్ద బాక్సింగ్ దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉన్నాయి.
ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ లాంటి దిగ్గజ జట్లు రెండు, మూడో స్థాయి బాక్సర్లనే పంపాయి. చైనా, అమెరికా పూర్తిగా దూరంగా ఉన్నాయి. ప్రపంచ టాప్ ఎనిమిది ర్యాంకర్లలో కేవలం 15 మంది మహిళలు, 11 మంది పురుషులు మాత్రమే ఈవెంట్‌కు వచ్చారు. హోస్ట్ దేశం కావడంతో భారత్‌కు అన్ని 20 వెయిట్ కేటగిరీల్లోనూ ఆటోమేటిక్ ఎంట్రీ లభించింది. పూర్తి బలమైన జట్టునే రంగంలోకి దింపామన్నమాట.
ఫలితంగా కొన్ని కేటగిరీల్లో ముగ్గురే పోటీ పడ్డారు. నూపుర్ షియోరాన్, పూజా రాణి, సవీతా బూరా, నీరజ్ ఫోగట్ లాంటి వాళ్లు కేవలం పాల్గొన్నంతనే పతకాలు దక్కించుకున్నారు. పూజా రాణి ఫైనల్ మాత్రమే ఆడి రజతం సాధించగా... సవీతా, నీరజ్ ఒక్కో మ్యాచ్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
అయినప్పటికీ భారత్ చరిత్ర సృష్టించింది. అన్ని 20 వెయిట్ కేటగిరీల్లోనూ పతకం సాధించిన మొదటి అంతర్జాతీయ టోర్నీ ఇదే. మహిళల జట్టు ఏడు బంగారం, ఒక రజతం, రెండు కాంస్యాలతో అదరగొట్టగా... పురుషులు రెండు బంగారం, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు సాధించారు. పురుషుల విభాగంలో 80 స్లాట్లకు 65 మంది వచ్చారు. మహిళల విభాగంలో మాత్రం 10 కేటగిరీలకు కేవలం 44 మంది మాత్రమే. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ సింగ్ చెప్పినట్టుగా, ‘ఈ టోర్నీ ఆతిథ్యం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం మన బాక్సర్లకు ర్యాంకింగ్ పాయింట్లు సేకరించి, రాబోయే పెద్ద ఈవెంట్‌లలో మంచి సీడింగ్ పొందడం.’ ఈ లక్ష్యం పూర్తిగా నెరవేరింది.
పలుచని పోటీ ఉన్నా... భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనలు చేశారు. హెపటైటిస్‌తో పోరాడి తిరిగొచ్చిన ప్రీతి పవార్ (54 కేజీ) ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ హువాంగ్ హ్సియావో వెన్ (చైనీస్ తైపీ), ప్రపంచ కాంస్య విజేత సిరిన్ చర్రాబీ (ఇటలీ)లను ఓడించి బంగారు పతకం సాధించింది.
డోపింగ్ సస్పెన్షన్ తర్వాత తిరిగి వచ్చిన పర్వీన్ హుడా కూడా ప్రపంచ రజత విజేత అనెటా రైగియెల్స్కా (పోలాండ్)ను చిత్తు చేసి గోల్డ్ అందుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో నిరాశపర్చిన టూ-టైమ్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్... ఈ టోర్నీలో బంగారు పతకంతో ఫామ్‌లోకి తిరిగి వచ్చింది. గత ఏడాది ఎలోర్డా కప్ తర్వాత ఆమెకు వచ్చిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే.
మొత్తంమీద ఈ విజయం గర్వంతో పాటు ఆశలు రేకెత్తిస్తోంది, ర్యాంకింగ్స్‌లో భారత్‌కు బూస్ట్ ఇచ్చింది. కానీ నిజమైన పరీక్ష మాత్రం ఇంకా మిగిలే ఉంది. పూర్తి బలమైన ప్రత్యర్థులతో కూడిన పెద్ద టోర్నీల్లో పతకాలు సాధించడమే.
