
20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 20 నెలల్లోనే 6.28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ, మౌలిక సదుపాయాలు, వైద్య, విద్యా రంగాల పురోగతిపై శాసనసభలో ఆయన విస్తృతంగా మాట్లాడారు. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, దానికంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
సీఎం తెలిపిన వివరాల ప్రకారం, ఎంఎస్ఎంఈల ద్వారా 2.48 లక్షల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేల ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అదేవిధంగా మెగా డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ నియామకాల ద్వారా 30,500 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు.
2019, 2024 మధ్యకాలంలో రాష్ట్ర ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని సీఎం విమర్శించారు. జాకీ, అమర్‌రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీపై ప్రతికూల వాతావరణం ఏర్పడిందని, ఆర్బీఐ నివేదిక ప్రకారం 2019, 20 నుంచి 2023, 24 మధ్య 913 కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు.
ఒకప్పుడు “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు చిరునామాగా ఉన్న ఏపీ, ఇప్పుడు “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు మారిందని పేర్కొన్నారు. పెట్టుబడులకు వేగంగా అనుమతులు ఇవ్వడానికి 26 విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
భారీ పెట్టుబడులు - లక్షల ఉద్యోగాలు
ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం వెల్లడించారు. వీటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.
విశాఖను ఐటీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గూగుల్, టాటా, టీసీఎస్ వంటి సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని తెలిపారు. అలాగే ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు ఈ నెలలో శంకుస్థాపన చేస్తామని, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్‌కు పునాది వేస్తామని వెల్లడించారు.
గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలకు ఊతం
ఏఎం గ్రీన్ ద్వారా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభించామని సీఎం తెలిపారు. ఎన్టీపీసీ రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నదని చెప్పారు. టాటా సంస్థ కూడా రూ.6 వేల కోట్లతో కొత్త యూనిట్ ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. పెట్టుబడులను సుస్థిరంగా కొనసాగించేందుకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం తెలిపారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటవుతోందని చెప్పారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే అమరావతి క్వాంటం వ్యాలీకి చిరునామాగా మారుతుందని పేర్కొన్నారు. “వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్” కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని ఐదు జోన్లలో యువతకు ఆవిష్కరణలు, నైపుణ్యాలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
వైద్య రంగంలో సంస్కరణలు
దేశంలో తొలిసారిగా ప్రజలందరికీ వర్తించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నామని సీఎం చెప్పారు. ఈ పథకం ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నామని, ఇది ప్రైవేటు ఆధీనంలోకి వెళ్లడం కాదని, ప్రభుత్వ ఆస్తిగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో నమోదు చేసే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
విద్యా రంగం - తెలుగు పరిరక్షణ
విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్స్ నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని, తెలుగును పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
పర్యాటక రంగ అభివృద్ధి
పర్యాటక రంగాన్ని ఉపాధి సృష్టించే ప్రధాన రంగంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. 102 ఒప్పందాల ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. వీటి ద్వారా సుమారు 3.4 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయని తెలిపారు.
సూర్యలంక బీచ్‌ను గోవాతో పోటీ పడే స్థాయికి తీసుకువస్తామని చెప్పారు. అఖండ గోదావరి, పాపికొండలు, గండికోట వంటి ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కారావాన్‌లు, హోం స్టేలు, టెంట్ సిటీల ద్వారా పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా మార్చుతున్నామని తెలిపారు.
ఎక్సైజ్‌లో భారీ కుంభకోణం
గత ప్రభుత్వ కాలంలో ఎక్సైజ్ శాఖలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని సీఎం ఆరోపించారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీతో విచారణ జరుగుతోందని తెలిపారు. గతంలో నాసిరకం మద్యం వల్ల వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారని, ఇప్పుడు ఎక్సైజ్ విధానాన్ని పారదర్శకంగా మార్చి అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో స్పష్టం చేశారు.
