
20 నెలల్లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి: మంత్రి ఉత్తమ్
ఉమ్మడి మహబూబ్‌నగర్, దక్షిణ తెలంగాణ జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జలసౌధలో నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించింది.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రాబోయే 20 నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కొయిలసాగర్ ప్రాజెక్టుల పెండింగ్ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కొయిలసాగర్‌కు రూ.185 కోట్లు వెచ్చించనున్నారు.
కృష్ణా జలాల వినియోగం - గత ప్రభుత్వ నిర్లక్ష్యం
కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన వాటాను ఒక్క బొట్టు కూడా వృథా కాకుండా వినియోగించుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2014 తర్వాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగంపై చూపిన నిర్లక్ష్యం వల్ల అనేక ప్రాజెక్టులు కుంటుపడ్డాయని విమర్శించారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో భూసేకరణ, పునరావాసానికి ప్రాధాన్యతనిచ్చామని ఆయన తెలిపారు.
ఇటీవల ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ 148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతో దేశంలోనే అత్యధిక ఉత్పత్తిని సాధించిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.20,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. భూసేకరణ పనులను 'మిషన్ మోడ్'లో పూర్తి చేసి, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు.
