
20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్‌లో భారత్.. నేడే తొలి మ్యాచ్
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 'ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్ 2026'లో భాగంగా నేడు భారత్ తన తొలి పోరులో వియత్నాంతో తలపడనుంది. గతంలో 2022లో భారత్ ఆతిథ్యమిచ్చినప్పటికీ, కరోనా కారణంగా అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, 2003 తర్వాత భారత్ పూర్తిస్థాయిలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి. మార్చి 1న ప్రారంభమైన ఈ టోర్నీ 21 వరకు కొనసాగనుంది. గ్రూప్-సీలో ఉన్న భారత్.. వియత్నాంతో పాటు అగ్రశ్రేణి జట్లు జపాన్, చైనీస్ తైపీలతో కూడా పోటీ పడనుంది.
ప్రపంచకప్ బెర్తే లక్ష్యం
ఈ ఆసియా కప్ కేవలం ఖండస్థాయి విజేతను నిర్ణయించడమే కాకుండా, 2027లో బ్రెజిల్‌లో జరిగే ఫిఫా మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు మార్గం సుగమం చేయనుంది. ఈ టోర్నీలో సెమీఫైనలిస్టులుగా నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్లో ఓడిన జట్లకు ప్లే-ఆఫ్స్ ద్వారా మరో అవకాశం ఉంటుంది. కొత్త కోచ్ అమేలియా వాల్వెర్డె నేతృత్వంలో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. టర్కీలో నాలుగు వారాల పాటు కఠిన శిక్షణ పొందిన అనంతరం, భారత జట్టు గత నెలలోనే ఆస్ట్రేలియా చేరుకుంది.
అనుభవం.. యువత కలయిక
భారత్ ప్రకటించిన 26 మంది సభ్యుల జట్టులో అనుభవం, యువత సమపాళ్ళలో ఉన్నారు. స్వీటీ దేవి, మనీషా కల్యాణ్, గ్రేస్ డాంగ్మే సహా ఎనిమిది మంది క్రీడాకారిణులు గత ఆసియా కప్‌లోనూ ప్రాతినిధ్యం వహించారు. 91 మ్యాచ్‌ల అనుభవం ఉన్న గ్రేస్ డాంగ్మే జట్టులో కీలక క్రీడాకారిణి కాగా, 20 ఏళ్ల షిల్కీ దేవి అత్యంత పిన్న వయస్కురాలు. అయితే సీనియర్ ప్లేయర్ అంజు తమంగ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం భారత్‌కు ఎదురుదెబ్బ. ఆమె స్థానంలో కరిష్మా షిర్వోయికర్‌ను ఎంపిక చేశారు. గతంలో 1980, 1983లో రన్నరప్‌గా నిలవడమే ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన.
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):
నేడు (మార్చి 4):
భారత్ వర్సెస్ వియత్నాం (సాయంత్రం 4:30 గం.)
మార్చి 7 (శనివారం):
భారత్ వర్సెస్ జపాన్ (సాయంత్రం 4:30 గం.)
మార్చి 10 (మంగళవారం):
భారత్ వర్సెస్ చైనీస్ తైపీ (మధ్యాహ్నం 2:30 గం.)
ఈ మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావు. కేవలం 'ఫ్యాన్‌కోడ్' యాప్, వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
భారత జట్టు వివరాలు
గోల్‌కీపర్లు:
పంతోయి చాను ఎలాంగ్‌బామ్, శ్రేయ హుడా, సౌమ్య నారాయణస్వామి
డిఫెండర్లు:
అస్తమ్ ఓరాన్, జూలీ కిషన్, మార్టినా థోక్‌చోమ్, నిర్మలా దేవి ఫంజౌబామ్, సంజు, సరిటా యుమ్నం, శిల్కీ దేవి హేమం, సుష్మిత లెప్చా, స్వీటీ దేవి నంగ్‌బామ్
మిడ్‌ఫీల్డర్లు:
అవేకా సింగ్, బబీనా దేవి లిషమ్, జసోద ముండా, సన్ఫిదా నోంగ్రుమ్, సంగిత బాస్‌ఫోర్
ఫార్వర్డ్‌లు:
కరిష్మా షిర్వోయికర్, గ్రేస్ డాంగ్మే, కవియా పక్కిరిసామి, లిండా కొమ్ సెర్టో, మాలవిక పి, మణీషా కళ్యాణ్, ప్యారి జక్సా, రింపా హల్దార్, సౌమ్య గుగులోత్
