
20న బీహార్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం
బీహార్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 20న పాట్నాలో జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు ఎన్‌డీఏ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం.
నితీశ్ రాజీనామా 19న?
ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఈ నెల 19న గవర్నర్‌కి రాజీనామా సమర్పించే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. అదే రోజు నితీశ్‌కుమార్‌ను విధాన సభాపక్ష నేతగా అధికారికంగా ఎన్నుకోనున్నారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశం కానున్నారని, అందులో విధానసభాపక్ష నేతను ఎన్నుకుంటారని తెలిపారు. ప్రమాణ స్వీకారం 20వ తేదీన లేదా 21న జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికే గాంధీ మైదాన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.
కేబినెట్ సమావేశం – సభ రద్దుకు సిఫార్సు
సభ రద్దు సిఫార్సు చేయడానికి సీఎంను అధికారపరచినట్టు రాష్ట్ర మంత్రి వివరించారు. బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లే భావించాలని జేడీయూ సీనియర్ నేత అశోక్‌చౌదరీ తెలిపారు. త్వరలోనే కొత్త క్యాబినెట్ ఏర్పడనుందని స్పష్టం చేశారు. క్యాబినెట్ రద్దయినట్లేనని ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కొత్త మంత్రివర్గం ఏర్పడబోతోంది. ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి పోటీ లేదు, సీఎంగా మళ్లీ నితీశ్‌కుమారే అని ఆయన స్పష్టం చేశారు. జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్‌రంజన్ ప్రసాద్ మాట్లాడుతూ బీహార్ ప్రజలు భారీ మెజార్టీతో నితీశ్‌కుమార్, మోడీ నాయకత్వానికే విజయాన్ని అంకితం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పనితీరు ప్రజల జీవితాలను మార్చేసిందని అన్నారు. కేబినెట్ తర్వాత నితీశ్‌కుమార్, డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి, ముఖ్య కార్యదర్శి ప్రత్యయ అమృత్ లతో కలిసి గవర్నర్ అరీఫ్ మొహమ్మద్ ఖాన్‌ను కలిసి నిర్ణయాన్ని తెలియజేశారు. బీహార్ ఎన్డీఏ ప్రభుత్వంలో 36 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేబినెట్ అభినందన తీర్మానం
ఎన్‌డీఏ అఖండ విజయానికి కారణమైన నితీశ్ కుమార్ నాయకత్వాన్ని అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని మంత్రి విజయ చౌదరి తెలిపారు. దూరదృష్టి గల ప్రభుత్వ విధానాల వల్లే ఈ రికార్డు విజయమొచ్చిందన్నారు.
రేసులో ఉన్నది వీరే
బీహార్‌లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నవంబర్ 20న జరగనున్న నేపథ్యంలో, కేబినెట్ భాగస్వామ్యంపై ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య జోరుగా లాబీయింగ్ మొదలైంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త కేబినెట్‌లో బీజేపీ, జేడీయూ వంటి ప్రధాన భాగస్వామ్యాల నుంచి 5–6 మంది కొత్త ముఖాలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
10వసారి సీఎంగా నితీశ్
జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుశ్వాహా ఈసారి కేబినెట్‌లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వర్గాలు చెబుతున్నాయి.
సీఎం నితీశ్‌కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతుండగా, ఆయన 19న గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నారు.
జేడీయూ గతంలో మంత్రులుగా పనిచేసిన వారినే ఎక్కువ మందిని కొనసాగించనుండగా, బీజేపీ కొన్ని కొత్త పేర్లను మంత్రుల జాబితాలో చేర్చబోతుందని తెలుస్తోంది.
పాత కేబినేటే ఉండనుందా?
గత కేబినెట్‌లో పోటీ చేసిన 25మందిలో 24మంది గెలిచారు. సుమిత్ కుమార్ సింగ్ మాత్రమే ఓడిపోయారు. ఈయన 2010లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, తరువాత జేడీయూలో చేరి మంత్రి అయ్యారు.ఈ సారి జేడీయూ టికెట్‌పై పోటీ చేసి సీటును నిలబెట్టుకోలేకపోయారు. జేడీయూ–బీజేపీతో పాటు ఎల్జేపీ (నేత చిరాగ్ పాస్వాన్, హామ్–ఎస్ నేత జితన్ రామ్ మాంఝీ, ఆర్‌ఎల్‌ఎం అధినేత ఉపేంద్ర కుశ్వాహా పార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు లభించనుందని సమాచారం.
తాజా లెక్కల ప్రకారం
ఎల్జేపీకీ 3 మంత్రి పదవులు, హామ్ కు 1, ఆర్‌ఎల్‌ఎంకు 1 లభించవచ్చని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో బీజేపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మందితో పాటు సీఎం నితీశ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 2020లో 50 కంటే తక్కువ ఎమ్మెల్యేలుండగా గత కేబినెట్‌లో 12 పోస్టులు మాత్రమే దక్కాయి. ఈసారి మా బలం భారీగా పెరిగింది. అందుకే ప్రాతినిధ్యం కూడా పెరుగుతుందంటున్నారు.
జేడీయూ – కేబినెట్ జాబితాలో ఉన్నవారు
బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, సునీల్ , లేసీ సింగ్, షీలా మందల్, మదన్ సాహ్ని, రత్నేష్ సదా, మహ్మద్ జమా ఖాన్, జయంత్ రాజ్, ఉమేష్ సింగ్ కుశ్వాహా, అశోక్ చౌదరి. కొత్తగా వచ్చే కేబినేట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నవారు రాహుల్ కుమార్ సింగ్, సుధాంశు శేఖర్, కలాదర్ ప్రసాద్ మండల్, పన్నాలాల్ సింగ్ పటేల్.
బీజేపీ నుంచి కాబోయే మంత్రులు
బీజేపీ వర్గాల ప్రకారం, ఎక్కువమంది పాత మంత్రులే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సామ్రాట్ చౌదరి, ప్రేం కుమార్, మంగళ పాండే, విజయ్ కుమార్ సిన్హా, నితీష్ మిశ్రా, రేణు దేవి, జీవేశ్ కుమార్, నీరజ్ కుమార్ సింగ్, జనక్ రామ్, హరి సహ్ని, కేదార్ ప్రసాద్ గుప్తా, సురేంద్ర మెహతా, సంతోష్ కుమార్ సింగ్, సునీల్ మోతీ లాల్ ప్రసాద్. కొత్తగా మంత్రులుగా వీరే వచ్చే అవకాశం ఉందని వస్తోన్న వారి పేర్లు రణా రణధీర్, గాయత్రి దేవి, విజయ్ కుమార్ ఖెమ్‌కా.
ప్రమాణస్వీకారం కోసం పాట్నా సిద్ధం
ప్రమాణ స్వీకారం జరగనున్న గాంధీ మైదాన్ ను నవంబర్ 20 వరకు పూర్తిగా మూసివేశారు. ప్రజలకు అందుబాటులో అప్పటి వరకు ఉండదు. ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానుండడంతో భద్రతా బందోబస్తు భారీగా పెంచినట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ సహా అనేక ఎన్‌డీఏ అగ్రనేతలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.
