
టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సంచలనం సృష్టించింది ఇంగ్లాండ్ జట్టు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లో చరిత్రను తిరగరాసింది. కేవలం 20 ఓవర్లలో 304/2 పరుగుల భారీ స్కోరు సాధించి, అంతకుముందు భారత్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టెస్టు హోదా ఉన్న దేశాల్లో టీ20ల్లో 300కు పైగా స్కోరు బాదిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే వారి నిర్ణయం ఎంత తప్పో మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే స్పష్టమైంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బట్లర్ కేవలం 18 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అతని దూకుడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు పటిష్టమైన పునాది వేసింది.
సాల్ట్, బట్లర్ విధ్వంసం
బట్లర్ 30 బంతుల్లో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే అసలు బాదుడును మొదలుపెట్టింది ఫిలిప్ సాల్ట్. ఫిలిప్ దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేస్తూ కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ. సాల్ట్ ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించి 60 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 141 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా కేవలం 21 బంతుల్లో 41 పరుగులు చేసి ఇంగ్లాండ్ స్కోరును 300 మార్కు దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లాండ్ సాధించిన 304 పరుగులు టెస్ట్ హోదా ఉన్న దేశాల మధ్య అత్యధిక టీ20ఐ స్కోరు. అంతకుముందు భారత్ 2024లో బంగ్లాదేశ్పై చేసిన 297 పరుగుల రికార్డును బద్దలు కొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు నేపాల్ (మంగోలియాపై 314/3), జింబాబ్వే (గాంబియాపై 344/4) మాత్రమే 300కు పైగా పరుగులు చేశాయి. అయితే అవి అసోసియేట్ దేశాలపై సాధించిన రికార్డులు.
దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన
305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ (3/25), శామ్ కర్రన్ (2/11), లియామ్ డాసన్ (2/34), విల్ జాక్స్ (2/2) వంటి బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా ఈ విజయం ద్వారా ఇంగ్లాండ్ సిరీస్ను 1-1తో సమం చేసింది.
