Let's talk: editor@tmv.in
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ నిర్దోషి: స్పెషల్ కోర్టు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ నిర్దోషి: స్పెషల్ కోర్టు

Pinjari Chand
23 జనవరి, 2026

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో హింసను రెచ్చగొట్టిన కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీలోని స్పెషల్ కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. ఆరోపణలను నిరూపించే బలమైన సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. స్పెషల్ జడ్జి దిగ్ వినయ్ సింగ్ తీర్పు వెల్లడిస్తూ, బాధితులు, వారి కుటుంబాలు అనుభవించిన బాధను కోర్టు అర్థం చేసుకుంటుందని తెలిపారు. అయితే న్యాయస్థానం భావోద్వేగాల ఆధారంగా కాకుండా, కేవలం సాక్ష్యాలు మరియు చట్టపరమైన ప్రమాణాల ప్రకారమే తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున హాజరైన చాలా మంది సాక్షులు ప్రత్యక్ష సాక్షులు కాదని, విన్న మాటల ఆధారంగా మాత్రమే వాంగ్మూలాలు ఇచ్చారని కోర్టు పేర్కొంది. మూడు దశాబ్దాల పాటు సజ్జన్ కుమార్ పేరు ప్రస్తావించని సాక్షులు, ఇప్పుడు ఆలస్యంగా ఆరోపణలు చేయడం నమ్మదగినదిగా పరిగణించలేమని తెలిపింది. సజ్జన్ కుమార్ ఘటన స్థలంలో ఉన్నట్లు, మూకలను రెచ్చగొట్టినట్లు లేదా కుట్రకు పాల్పడ్డట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చింది. అయితే 80 ఏళ్ల సజ్జన్ కుమార్ ఇతర 1984 అల్లర్లకు సంబంధించిన హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ ప్రస్తుతం తిహార్ జైలులోనే ఉన్నారు.

నా కళ్ల ముందే మా నాన్నను సజీవ దహనం చేశారు

తన తండ్రిని కళ్ల ముందు చూసిన కుమార్తె, యవ్వనంలో వితంతువు అయిన భార్య, 1984 అల్లర్లలో తన ప్రియమైన వారిని కోల్పోయిన వ్యక్తి... వీరందరూ గురువారం ఢిల్లీ కోర్టు వెలుపల నిలబడి, నాలుగు దశాబ్దాలుగా దుఃఖాన్ని మోస్తూ గురువారం కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూశారు. అయితే కోర్టు సరైన ఆధారాలు లేనందున 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాలలో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను నిర్దోషిగా విడుదల చేసింది. న్యాయం కోసం చాలాకాలంగా ఎదురుచూశామని, అలసిపోయామని, అయినా న్యాయం దక్కలేదని కుటుంబాలు నిరాశను వ్యక్తం చేశాయి. కోర్టు గది వెలుపల నిలబడి, నిర్మల్ కౌర్ మంటల్లో కాలిపోయిన బాల్యాన్ని గుర్తుచేసుకుంది. నా కళ్ల ముందే నా తండ్రిని సజీవ దహనం చేశారు, నేను 42 సంవత్సరాలుగా ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు తిరుగుతూ, న్యాయం ఏదో ఒక రోజు జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానని ఆమె న్యాయం కోసం ఏడుస్తూ మీడియాకు తెలిపింది. ఆ రోజు తన కుటుంబం నాశనం అయింది. నేనూ నాశనం అయ్యాను, నా జీవితంలోని ప్రతి మంచి విషయం దూరమైందని అన్నారు. దశాబ్దాలుగా ఆశలు పెట్టుకున్న తర్వాత కూడా న్యాయం దక్కలేదని ఆమె బోరున విలపించింది. ఆమె పక్కనే నిలబడ్డ మరొక స్త్రీ కోపంతో, నిరాశతో గద్గద స్వరంతో మాట్లాడుతోంది. ఆ వ్యక్తిని శిక్షించి ఉరితీయాలని ఆమె కోరింది. ఇది జరగకపోతే, మేం కోర్టు బయటే ఉంటామని, ఇక్కడే చనిపోవాల్సి వచ్చినా - మేం కోల్పోయేది ఏమీ లేదని హెచ్చరించింది.

కోర్టులకు తిరుగుతూ జీవితం గడిపాం

అల్లర్లలో మరో బాధితుడి కుటుంబ సభ్యుడైన వజీర్ సింగ్ మాట్లాడుతూ కుమార్ దాదాపు 18 హత్య కేసులను ఎదుర్కొన్నప్పటికీ, అతన్ని విడిచిపెట్టలేదని అన్నారు. అతను వేలాది మంది సిక్కుల హత్యకు నేతృత్వం వహించాడు. నా లాంటి కుటుంబాలు తమ జీవితాంతం కోర్టు గదుల్లోకి, బయటకు తిరుగుతూ గడిపాయని సింగ్ అన్నారు. న్యాయం నిరాకరించబడితే, వారు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఇకపై పోరాడటానికి భయపడబోమని ఆయన స్పష్టం చేశారు.

రోడ్లు శవాలతో నిండిపోయాయి

బాగీ కౌర్ కి, అల్లర్ల జ్ఞాపకాలు ఇప్పటికీ భరించలేనివిగా కళ్లముందే స్పష్టంగా కదలాడుతున్నాయి. మా కుటుంబంలో పది మంది మరణించారు. అల్లర్ల సమయంలో, రోడ్లు శవాలతో నిండిపోయాయని నాకు స్పష్టంగా గుర్తుంది. రోడ్డు దాటడానికి ఒకరు మృతదేహాలపై నుంచి దూకాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది. తన కుటుంబం కలలు నాశనమవడాన్ని తాను చూసినట్లు ఆమె వివరించింది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఇన్ని సంవత్సరాలలో ఒక్క రోజు కూడా కోర్టు విచారణకు హాజరు కాలేదని ఆమె పేర్కొన్నారు. మా బాధను ఇప్పుడు పూర్తిగా విస్మరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సెక్యూరిటీ అయిన సత్వంత్ సింగ్‌ను ఉరితీశారు. అయితే సుమారు వెయ్యి మంది మరణాలకు కారణమైన వ్యక్తి ఇంకా ఎందుకు బతికే ఉన్నాడు? అని కౌర్ ప్రశ్నించింది. న్యాయం కోసం తన 42 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ తాను ఎవరి వితంతువునో తెలుసునని, అయినప్పటికీ ఎవరూ తన కేకలు వినడానికి ఇష్టపడటం లేదని ఆమె పేర్కొన్నారు. కోర్టు వెలుపల, నిరసనకారులు వెళ్లడానికి నిరాకరించారు, తీర్పు వెలువడిన చాలా కాలం తర్వాత కూడా వారి ఆక్రందనలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి. న్యాయం కోసం తమ పోరాటం ఇంకా ముగియలేదని వారు తెలిపారు. మళ్లీ న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

సజ్జన్ కుమార్ కేసు ముగిసే వరకు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో హింసకు ప్రేరేపించారనే కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు గురువారం నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసు ముగిసే వరకు జరిగిన ముఖ్య పరిణామాల క్రమం ఇలా ఉంది.

ఘటనల టైమ్‌లైన్

• 1992: జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాలకు సంబంధించిన రెండు కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు.

• డిసెంబర్ 2014: 1984 అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అవసరాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జీపీ మాథూర్ కమిటీ ఏర్పాటు.

• ఫిబ్రవరి 12, 2015: సిట్ ఏర్పాటు.

• 2016: సంబంధిత రెండు ఎఫ్‌ఐఆర్‌లను సిట్ పునఃపరిశీలించి దర్యాప్తును తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయం.

• 2018: పాలం కాలనీ ప్రాంతంలో 1984 నవంబర్ 1–2 తేదీల్లో ఐదుగురి హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించడంతో జైలుకు తరలింపు.

• జూలై 2022: రెండు ఎఫ్‌ఐఆర్‌లకు కలిపి పోలీసుల చార్జ్‌షీట్ దాఖలు.

• ఆగస్టు 2023: జనక్‌పురి కేసులో అల్లర్లు, ద్వేషాన్ని రెచ్చగొట్టడం ఆరోపణలపై కోర్టు అభియోగాలు నమోదు. వికాస్‌పురి కేసులో హత్య, కుట్ర ఆరోపణల నుంచి విడుదల.

• డిసెంబర్ 22, 2025: తుది వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

• జనవరి 22, 2026: జనక్‌పురి హింస కేసులో సజ్జన్ కుమార్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

నానావతి కమిషన్ నివేదిక ప్రకారం

• ఢిల్లీలో 1984 అల్లర్లకు సంబంధించి 587 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

• ఈ అల్లర్లలో 2,733 మంది మరణించారు.

• సుమారు 240 కేసులు ‘ఆచూకీ లేనివి’గా మూసివేయగా, 250 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

• కేవలం 28 కేసుల్లో మాత్రమే శిక్షలు పడగా, వాటిలో సుమారు 400 మందికి దోషిగా తీర్పు వచ్చింది.

• వీరిలో సుమారు 50 మందికి హత్య కేసుల్లో శిక్షలు విధించగా, సజ్జన్ కుమార్ కూడా అందులో ఉన్నారు.

ప్రస్తుతం సజ్జన్ కుమార్ జైలులోనే ఉన్నారు. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్‌లో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్‌దీప్ సింగ్ హత్య కేసులో గత ఏడాది ఫిబ్రవరి 25న ట్రయల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.