Let's talk: editor@tmv.in
1965 ఇండో–పాక్ యుద్ధ వీరుడు కేజీ జార్జ్ మృతి

1965 ఇండో–పాక్ యుద్ధ వీరుడు కేజీ జార్జ్ మృతి

Pinjari Chand
9 మార్చి, 2026

1965 ఇండియా–పాకిస్థాన్ యుద్ధంలో వీరోచిత సేవలకు గాను వీర్ చక్ర అందుకున్న భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ లాన్స్ హవిల్దార్ కేజీ.జార్జ్‌ (95) కేరళలో కన్నుమూశారు. వయస్సు సంబంధిత అనారోగ్య కారణాలతో ఆయన శనివారం ఉదయం కొట్టాయం లోని తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జార్జ్ 1931 ఫిబ్రవరిలో కేరళలో జన్మించారు. ఆయన భారత సైన్యంలో కీలక విభాగమైన ఇండియన్ ఆర్మీ కాప్స్‌ ఆఫ్ సిగ్నల్స్ లో సేవలందించారు. ఈ విభాగం 1911లో స్థాపించారు. ఇండో-పాకిస్థాన్‌ 1965 యుధ్ద సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గాను వీర్ చక్ర పురస్కారం లభించింది. సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు శత్రు దళాల బలమైన గోళి దాడులు, వైమానిక దాడులు కొనసాగుతున్న సమయంలో కూడా ఆయన తన బృందాన్ని ముందుండి నడిపిస్తూ కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించారు.

ప్రత్యేకంగా 1965 సెప్టెంబర్ 8–9 రాత్రి జరిగిన శత్రు దాడి సమయంలో ప్రాణాపాయం ఉన్నప్పటికీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ముందువరుసలో ఉన్న బెటాలియన్లకు కమ్యూనికేషన్ లైన్‌ను ఆయన ఏర్పాటు చేశారు. ఈ ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఆయనకు వీర్ చక్ర అవార్డు ప్రకటించారు. జార్జ్ మనవడు రెమో జాన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తండ్రి, అన్న ప్రస్తుతం దుబాయ్‌లో ఉండటంతో కేరళకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా వారు ఇప్పటివరకు దుబాయ్ నుంచి బయలుదేరలేకపోయారని తెలిపారు. వారు భారత్‌కు చేరుకున్న తర్వాత కొట్టాయంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అప్పటివరకు జార్జ్ మృతదేహాన్ని స్థానిక మార్ట్యువరీలో భద్రపరిచారు.

శత్రు కాల్పుల మధ్య విధి నిర్వహణలో అసాధారణ ధైర్యం, అంకితభావం చూపినందుకు ఆయనకు భారతదేశ అత్యున్నత యుద్ధ వీరత పురస్కారాల్లో ఒకటైన వీర్ చక్ర ప్రదానం చేశారు. కే.జీ. జార్జ్ మృతి భారత సైన్య చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ముగిసినట్లుగా భావిస్తున్నారు. దేశ రక్షణ కోసం అచంచల ధైర్యం, త్యాగంతో పోరాడిన ఆ తరం సైనికులలో ఆయన ఒక ప్రముఖ ప్రతినిధిగా నిలిచారు. ఆయన సేవలు, స్ఫూర్తి భవిష్యత్ తరాల భారత సైనికులకు మార్గదర్శకంగా నిలుస్తాయని సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి.