
శ్రీలంక జైలు నుంచి 19 మంది తమిళనాడు మత్స్యకారులు విడుదల
సముద్ర సరిహద్దు దాటడంతో గత నెలలో శ్రీలంక నౌకాదళం తమిళనాడుకు చెందిన 19 మంది మత్య్సకారులను అరెస్టు చేసింది. తాజాగా వారిని విడుదల చేయడంతో మంగళవారం చెన్నైకి చేరుకున్నారు. రామనాథపురం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారులను మార్చి 25న అదుపులోకి తీసుకున్న శ్రీలంక అధికారులు, తరువాత అక్కడి కోర్టులో హాజరుపరచగా జైలుకు పంపించారు. అనంతరం న్యాయ ప్రక్రియ పూర్తయ్యాక వీరిని విడుదల చేశారు.
మొత్తం 30 మంది మత్స్యకారులను భారత రాయబారి కార్యాలయ అధికారులకు అప్పగించగా, వారిని తాత్కాలిక శిబిరంలో ఉంచి అత్యవసర ప్రయాణ పత్రాలు అందించారు. అనంతరం వీరిని విమానంలో చెన్నైకి తరలించారు. చెన్నైలో మత్య్సశాఖ అధికారులు కలుసుకుని, వారి స్వగ్రామాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. థంగచ్చిమడమ్‌కు చెందిన మత్స్యకారుడు సెబాస్టియన్ మాట్లాడుతూ, సముద్రంలో చేపల వేటలో ఉండగా తమను అరెస్టు చేశారని తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి శ్రీలంక పర్యటన నేపథ్యంలో తమను విడుదల చేశారని, ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా శ్రీలంక జైళ్లలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్రం ఉపాధి కల్పించాలి
ఇద్దరు మత్స్యకారులకు రూ.25,000 చొప్పున జరిమానా విధించగా, రెండు పడవల డ్రైవర్లపై రూ.40 లక్షల భారీ జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. రోజువారీ కూలీలుగా ఉన్న తమకు ఈ మొత్తం చెల్లించడం సాధ్యం కాదని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తరచూ అరెస్టులు, 30 నెలల వరకు జైలు శిక్ష భయం కారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లడంపై అనిశ్చితి నెలకొన్నదని మత్స్యకారులు తెలిపారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ముందుగా మొత్తం 52 మంది మత్స్యకారులను అరెస్టు చేసినట్లు, వారిలో కొందరు ఇప్పటికే విడుదలైనట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తరచూ నిర్బంధాలు కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు అధికారులను కోరారు.
