Let's talk: editor@tmv.in
19వ రోజుకు జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల ఆందోళన

19వ రోజుకు జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల ఆందోళన

Pinjari Chand
13 ఆగస్టు, 2026

పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన జార్ఖండ్‌లో 19వ రోజుకు చేరింది. రాంచీలోని జైపాల్‌ సింగ్‌ ముండా స్టేడియంలో బుధవారం అభ్యర్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం అందడంతో వైద్య బృందం నిరసన శిబిరానికి చేరుకుని వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్యుడు ఎస్‌కే ఝా మాట్లాడుతూ.. ఉదయం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించామని, పరీక్షించిన అభ్యర్థులందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి మందులు అందిస్తూ, ప్రాథమిక వైద్యం చేస్తున్నట్లు వెల్లడించారు.

బీజేపీపై హేమంత్‌ సోరెన్‌ విమర్శలు

విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బీజేపీపై విమర్శలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ నిర్వహించిన నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షం సీబీఐ దర్యాప్తును డిమాండ్‌ చేస్తుండగా.. నిర్ణీత గడువుకు ఒక రోజు ముందుగానే జార్ఖండ్‌ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అనంతరం సోరెన్‌ మాట్లాడుతూ సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. సభలో కరెన్సీ నోట్లను విసిరి, ప్రదర్శించారని ఆరోపించారు. బీజేపీ రాజకీయాలకు, వారి ఉనికికి ఆ నోట్లే ఆధారమని వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి పట్టుదలతో పనిచేస్తోందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని సోరెన్‌ ఆరోపించారు. చిన్న, మధ్య తరహా, పెద్ద సంస్థలు మూతపడుతున్నాయని, అలాంటప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ నియామక పరీక్షల్లో ఎంపికైన వారిలో 75 శాతం నుంచి 100 శాతం వరకు స్థానిక ప్రాంతానికి చెందిన వారే ఉంటున్నారని చెప్పారు. బీజేపీ పాలనలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉద్యోగాలు పొందారని ఆరోపించారు.

వారిని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారు?: బాబూలాల్‌ మరాండీ

సోరెన్‌ వ్యాఖ్యలపై జార్ఖండ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బాబూలాల్‌ మరాండీ స్పందించారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట్లాడతారని తామంతా ఎదురుచూశామని, జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐ దర్యాప్తును సిఫారసు చేస్తారా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తారని భావించామని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అధికారులను కాపాడుతున్నారని మరాండీ ఆరోపించారు. పెద్దల పేర్లు బయటకు రాకుండా ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నారని అన్నారు.

ఎల్‌. ఖియాంగ్టే రాజీనామా చేశారని, అయితే జేఎస్‌ఎస్‌సీకి ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నది ఎవరు? అని ప్రశ్నించారు. అవకతవకలు జరిగిన సమయంలో ప్రశాంత్‌ కుమార్‌ చైర్మన్‌గా ఉన్నారని ఆరోపించిన ఆయన.. ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారని, ఎప్పుడు అరెస్టు చేస్తారని ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని పదవుల్లో నియమించి, ప్రభుత్వం మంచి చేస్తామని చెప్పడం హస్యాస్పదమన్నారు.

24 జిల్లాల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు

జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో పదేపదే పేపర్‌ లీక్‌లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల నుంచి అభ్యర్థులు రాంచీకి తరలివచ్చారు. జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ పరీక్షను రద్దు చేయడంతో పాటు, పరీక్షల్లో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న వరుస పేపర్‌ లీక్‌లపై ఉన్నతస్థాయి సీబీఐ దర్యాప్తు జరపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

19వ రోజుకు జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల ఆందోళన - Tholi Paluku