Let's talk: editor@tmv.in
19న తెలంగాణ జలహక్కులపై బీఆర్‌ఎస్‌ మహా సంగ్రామం

19న తెలంగాణ జలహక్కులపై బీఆర్‌ఎస్‌ మహా సంగ్రామం

Gaddamidi Naveen
15 డిసెంబర్, 2025

కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై పోరాటానికి సిద్ధమవుతూ బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కీలక సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్ర రాజకీయాలు, సాగునీటి హక్కులు, రైతాంగ సమస్యలు ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగనుందని బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌లో స‌మాచారం తెలిపింది.

అజెండాలో ప్రధాన అంశాలు: నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

ఈ అత్యంత కీలకమైన సమావేశంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులు, ప్రాజెక్టుల నిర్వహణపై చర్చ జరగనుంది. గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడంలో చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా, గోదావరి జలాలను అక్రమంగా వినియోగిస్తున్నా, దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు మరో ప్రజా ఉద్యమం అనివార్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రాజీ

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు రానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 91 టీఎంసీల నీటి కేటాయింపులు సాధిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 45 టీఎంసీలకు సరిపోతుందని కేంద్రం ముందు వేడుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ వైఖరి వల్ల పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంటోంది.

మరో ప్రజా ఉద్యమం తప్పదు: కేసీఆర్ భావన

తెలంగాణ ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని పార్టీ అధినేత కేసీఆర్ బలంగా భావిస్తున్నారు. ఈ సమావేశంలో, తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి లోతుగా చర్చ జరగనుంది. ఈ ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అలాగే, తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ ఈ కీలక అంశాలపై ఒక్కరూ గొంతు విప్పడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు అన్యాయం చేస్తోందని, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు జలదోపిడికి సహకరిస్తోందని పార్టీ విమర్శిస్తోంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజం మరోసారి ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధం కావాల్సిందేనని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్యం

బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందేవని, ఆయా ప్రాంతాల ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవని సమావేశంలో ప్రస్తావించనున్నారు. రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సమస్యలను విస్మరిస్తోందని, ఇక మౌనం వహించబోమని బీఆర్ఎస్ స్పష్టం చేయనుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కృష్ణా జలాలలో కేవలం 45 టీఎంసీలకు ఒప్పుకోవడం అనేది ఘోరాతిఘోరం, దుర్మార్గం అని బీఆర్‌ఎస్ పేర్కొంది.

సంస్థాగత నిర్మాణంపై చర్చ

సాగునీరు, రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదని పేర్కొంది.నీటి సమస్యలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు కీలక అంశాలపై ఈ నెల 19న నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ, చేపట్టబోయే ప్రజా ఉద్యమాల రూపురేఖలపై కీలక నిర్ణయాలు, వంటివి కూలంకషంగా చర్చ జరగనున్నది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, కృష్ణా, గోదావరి జలాల కేటాయింపుల అంశాల్లో రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశం శ్రీకారం చుట్టనుందని బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటిస్తోంది.

19న తెలంగాణ జలహక్కులపై బీఆర్‌ఎస్‌ మహా సంగ్రామం - Tholi Paluku