
18 వేలకుపైగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశాం: జేపీ.నడ్డా
దేశవ్యాప్తంగా తక్కువ ధరలకు జనరిక్ ఔషధాలు అందించేందుకు 11 ఏళ్లలో 18,646 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రధాన్ మంత్రి భారతీయ జనఔషధి పరివోజనను 2008లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, 2014 వరకు కేవలం 80 కేంద్రాలే ప్రారంభించారని చెప్పారు. మోడీ ప్రభుత్వంలో ఈ పథకం విస్తృతంగా అమలైందని , 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశంలో మొత్తం 18,646 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో 2,370 జన ఔషధి కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50–80 శాతం తక్కువ ధరలకు ఔషధాలు అందుతున్నాయని వివరించారు.
ప్రధాన్ మంత్రి భారతీయ జనఔషధి పరివోజన కింద ప్రస్తుతం 2,110 రకాల మందులు, 315 శస్త్రచికిత్స, వైద్య వినియోగ వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిలో హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, సంక్రమణ వ్యాధులు, అలెర్జీ, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు సంబంధించిన మందులు ఉన్నాయని చెప్పారు. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలోని దాదాపు అన్ని జనరిక్ మందులు ఈ పథకంలో భాగమని, అయితే ల్యాబ్ రియాజెంట్లు, వ్యాక్సిన్లు మాత్రం ఇందులో లేవని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కేంద్రాలకు ఔషధాల సరఫరా చేసేందుకు ఐటీ ఆధారిత సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో ఐదు గోదాములు, 41 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని వివరించారు. ప్రజా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఉచితంగా అవసరమైన మందులు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఫ్రీ డ్రగ్స్ సర్వీస్ ఇనిషియేటివ్ అమలు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.
రేబీస్ వ్యాక్సిన్ సమగ్ర ఉత్పత్తి గణాంకాలు లేవు
రేబీస్ చికిత్సకు ఉపయోగించే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ), రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ (ఆర్‌ఐజీ) ఉత్పత్తిపై సంవత్సరాల వారీ సమగ్ర డేటా నిర్వహించడం లేదని నడ్డా తెలిపారు. ఈ ఉత్పత్తులను పలు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు తయారు చేస్తున్నందున కేంద్రంగా గణాంకాలు లేవని చెప్పారు. దేశంలో సంవత్సరానికి సుమారు 81.7 మిలియన్ ఏఆర్‌వీ వయల్స్, 17.7 మిలియన్ ఆర్‌ఐజీ వయల్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, 2024–25లో 3,45,270 కిలోల ఏఆర్‌వీ, ఆర్‌ఐజీ ఎగుమతి కాగా, 2023–24లో 2,61,261 కిలోలు ఎగుమతి అయినట్లు తెలిపారు. ఆరోగ్యం రాష్ట్ర అంశం కావడంతో ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమం కింద కూడా రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నామని, ఆర్‌ఐజీ, ఏఆర్‌వీ కొనుగోలు ప్రక్రియ వికేంద్రీకృతంగా జరుగుతోందని చెప్పారు. సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు రాష్ట్రాలకు తరచూ సూచనలు ఇస్తున్నట్లు నడ్డా వెల్లడించారు.
