
18 మంది కంబోడియా సైనికులను విడుదల చేసిన థాయ్‌లాండ్
కంబోడియాతో గత ఐదు నెలలుగా కొనసాగుతున్న భీకర సరిహద్దు యుద్ధానికి ముగింపు పలుకుతూ థాయ్‌లాండ్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందంలో భాగంగా, తమ వద్ద బందీలుగా ఉన్న 18 మంది కంబోడియా యుద్ధ ఖైదీలను విడుదల చేసింది.
గత ఐదు నెలలుగా థాయ్‌లాండ్ కస్టడీలో ఉన్న ఈ సైనికులను సరిహద్దు వద్ద కంబోడియా అధికారులకు అప్పగించింది. గత శనివారం థాయ్‌లాండ్, కంబోడియా రక్షణ మంత్రులు సంతకం చేసిన సీజ్‌ఫైర్ ఒప్పందం ప్రకారమే ఈ విడుదల జరిగింది. థాయ్‌లాండ్‌లోని చంతబూరి ప్రావిన్స్ – కంబోడియాలోని పైలిన్ ప్రావిన్స్ మధ్య ప్రాంతంలో ఈ సైనికులను స్వదేశానికి పంపించారు.
థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, “ఇది మంచి మనసుతో తీసుకున్న నిర్ణయం. పరస్పర నమ్మకాన్ని పెంపొందించడానికీ, అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి ఉండడానికీ ఈ చర్య తీసుకున్నాం” అని తెలిపింది. జెనీవా కన్వెన్షన్ నిబంధనల ప్రకారం యుద్ధ సమయంలో ఖైదీలను యుద్ధం ముగిసే వరకు నిర్బంధించే హక్కు ఉన్నప్పటికీ, శాంతి దిశగా అడుగు వేయాలనే ఉద్దేశంతో విడుదల చేసినట్లు పేర్కొంది.
స్వాగతించిన కంబోడియా
కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. “ఈ చర్య రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొనడానికి సహాయపడుతుంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇది దోహదం చేస్తుంది” అని తెలిపింది. తమ సైనికులను తిరిగి తీసుకురావాలని ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరిందని కూడా పేర్కొంది.
ఈ సైనికుల విడుదలతో ఇరు దేశాల మధ్య పెద్ద అడ్డంకి ఒకటి తొలగినట్లైంది. సరిహద్దు ప్రాంతంపై హక్కుల విషయంలో జరిగిన రెండు దఫాల తీవ్ర పోరాటాల తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. థాయ్‌లాండ్ ఈ ఖైదీలను విడుదల చేయకపోవడం కాంబోడియాలో జాతీయవాద భావాలను రెచ్చగొట్టడానికి ఉపయోగపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
సీజ్‌ఫైర్ ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన 72 గంటల తర్వాత ఈ సైనికులను విడుదల చేయాల్సి ఉంది. ఆ గడువు మంగళవారం పూర్తయినా, సరిహద్దులో కాంబోడియా డ్రోన్లు చురుగ్గా ఉన్నాయని చెబుతూ థాయ్ అధికారులు పరిస్థితిని పరిశీలించిన తర్వాతే విడుదల చేశారు.
ఈ సైనికులు ఎలా పట్టుబడ్డారనే విషయంలో ఇరు దేశాలు వేర్వేరు వాదనలు వినిపించాయి. కంబోడియా వాదన ప్రకారం, తమ సైనికులు స్నేహపూర్వకంగా మాట్లాడేందుకు ముందుకు వెళ్లగా పట్టుకున్నారు. కానీ థాయ్‌లాండ్ మాత్రం వారు శత్రుత్వ ఉద్దేశంతో తమ భూభాగంలోకి చొరబడ్డారని చెబుతోంది.
ట్రంప్ మధ్యవర్తిత్వం
మొత్తంగా 20 మంది కంబోడియా సైనికులు పట్టుబడగా, ఇద్దరిని ఆరోగ్య కారణాలతో ముందే విడుదల చేశారు. ఈ సరిహద్దు వివాదానికి తొలి సీజ్‌ఫైర్‌ను మలేషియా మధ్యవర్తిత్వంతో కుదిర్చినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి కూడా కీలకంగా పనిచేసింది. అయినప్పటికీ డిసెంబర్ ప్రారంభంలో మళ్లీ భారీగా కాల్పులు జరిగాయి.
డిసెంబర్ 7న ఘర్షణలు ముదిరినప్పటి నుండి ఇప్పటివరకు థాయ్‌లాండ్‌లో మొత్తం 26 మంది సైనికులు, 45 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. తాజాగా సైనికుల విడుదలతో అయినా ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొంటుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
