Let's talk: editor@tmv.in
18 నెలల కనిష్ఠానికి సేవల రంగ వృద్ధి: హెచ్‌ఎస్‌బీసీ

18 నెలల కనిష్ఠానికి సేవల రంగ వృద్ధి: హెచ్‌ఎస్‌బీసీ

Shaik Mohammad Shaffee
7 ఏప్రిల్, 2026

దేశీయ సేవల రంగం వృద్ధి పథంలోనే కొనసాగుతున్నప్పటికీ, దాని వేగం గత 14 నెలల్లోనే అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కొత్త ఆర్డర్ల ప్రవాహం నెమ్మదించడంతో మార్చి నెలలో వృద్ధి నెమ్మదించిందని సోమవారం విడుదలైన హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ పీఎంఐ వెల్లడించింది. ఫిబ్రవరిలో 58.1గా ఉన్న ఈ సూచీ, మార్చిలో 57.5కు తగ్గింది. 2025 జనవరి తర్వాత కొత్త వ్యాపారాలు, కార్యకలాపాల్లో నమోదైన అత్యంత బలహీనమైన వృద్ధి ఇదేనని సర్వే పేర్కొంది. సాధారణంగా పీఎంఐ సూచీ 50 పైన ఉంటే వృద్ధిగాను, 50 కంటే తక్కువగా ఉంటే క్షీణతగాను పరిగణిస్తారు.

ఖర్చుల భారం.. ధరల మంట

సేవల రంగంలో పెట్టుబడి వ్యయాలు 2022 జూన్ తర్వాత ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చికెన్, వంట నూనె, గుడ్లు, విద్యుత్, చేపలు, పండ్లు, ఇంధనం, కూరగాయల ధరలు ఫిబ్రవరి నుంచి భారీగా పెరగడమే ఇందుకు కారణమని సర్వేలో పాల్గొన్న కంపెనీలు తెలిపాయి. పెరుగుతున్న ఇంధన, రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి సేవా సంస్థలు తమ సేవల ధరలను కూడా పెంచేశాయి. ఫలితంగా విక్రయ ధరల ద్రవ్యోల్బణం గత ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. ముఖ్యంగా కన్జూమర్ సర్వీసెస్, ఫైనాన్స్ & ఇన్సూరెన్స్ రంగాల్లో ఈ ధరల పెరుగుదల ఎక్కువగా కనిపించింది.

జోరుగా ఎగుమతులు.. ఉపాధికి ఊతం

దేశీయంగా డిమాండ్ నెమ్మదించినప్పటికీ, విదేశీ మార్కెట్ల నుంచి కొత్త ఎగుమతి ఆర్డర్లు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, అమెరికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి ఆర్డర్లు పెరగడం వల్ల ఎగుమతుల వృద్ధి 2024 మధ్య కాలం తర్వాత అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ సానుకూల పరిణామాలతో కంపెనీల్లో నమ్మకం పెరిగి, ఉపాధి కల్పనపై మొగ్గు చూపుతున్నాయి. వరుసగా మూడో నెలలోనూ ఉద్యోగ నియామకాలు పెరిగాయని, 2025 మధ్య కాలం తర్వాత ఇదే బలమైన ఉపాధి వృద్ధి అని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజల్ భండారి విశ్లేషించారు.

తయారీ, సేవల రంగాల పనితీరును ప్రతిబింబించే 'హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్' కూడా ఫిబ్రవరిలో 58.9 నుండి మార్చిలో 57.0కు పడిపోయింది. ఇది గత మూడున్నర ఏళ్లలో నమోదైన అత్యంత తక్కువ వృద్ధి రేటు కావడం గమనార్హం. కొత్త ఆర్డర్ల పెరుగుదల రేటు 2023 నవంబర్ తర్వాత అత్యంత బలహీనంగా ఉంది. తయారీదారులు ధరల పెంపును కొంత మేర నియంత్రించినప్పటికీ, సేవా రంగంలో ధరల పెరుగుదల మాత్రం వినియోగదారులపై భారం మోపుతోంది.

ఆశాజనకంగా భవిష్యత్తు

ప్రస్తుత వృద్ధి వేగం తగ్గినప్పటికీ, భవిష్యత్తుపై సేవా రంగ సంస్థలు అత్యంత ధీమాతో ఉన్నాయి. రానున్న ఏడాదిలో డిమాండ్ మెరుగుపడుతుందని, మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వ్యాపార విశ్వాసం వ్యక్తమవుతోంది. మెరుగైన అడ్వర్టైజింగ్, కస్టమర్ రిలేషన్స్ ద్వారా వ్యాపారాలను విస్తరించవచ్చని సంస్థలు ఆశిస్తున్నాయి. సుమారు 400 సేవా రంగ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఎస్ అండ్ పీ గ్లోబల్ ఈ నివేదికను రూపొందించింది.