
18న బీసీ సంఘాల బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు
బీసీ రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బీసీలకు రిజర్వేషన్లు దక్కడం కష్టమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీసీల సమస్యలపై తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన లక్ష కోట్ల బడ్జెట్ నుంచి మొదలుకొని బీసీ సబ్‌ప్లాన్ వంటి ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేసే ప్రతి ప్రయత్నానికి తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
రిజర్వేషన్ల వాటా డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల కోసం కేవలం 42శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిందని, అయితే విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లోనూ అమలు కావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల నుంచి మొదలుకొని అన్నింటిలోనూ 42శాతం వాటా ఇవ్వాలని బీసీ సమాజం డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి రంగాల్లో ఈ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే లక్షల మంది బీసీ బిడ్డలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు
బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో చట్టంగా మారాలంటే, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి రెండూ ఏకమైతేనే అది సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. పార్లమెంటులో ఈ బిల్లు పెట్టినట్లయితే, తమ పార్టీ నలుగురు రాజ్యసభ ఎంపీలు కచ్చితంగా అనుకూలంగా ఓటు వేసేది మొట్టమొదటగా బీఆర్‌ఎస్ పార్టీయే అని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి ఈ అంశాన్ని తీసుకువెళితే, తాము వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే, ఈ సమస్యను కూడా ఢిల్లీ దాకా తీసుకువెళ్లి బీసీ రిజర్వేషన్లను సాధించుకుందామని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర బంద్ కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలని బీసీ జేఏసీ ఛైర్మన్ ఎంపీ ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించ తలపెట్టిన బంద్‌కు తమ బీఆర్‌ఎస్ పార్టీ నైతిక మద్దతు ఇస్తుందని కేటీఆర్ ప్రకటించారు.
