
తెలంగాణలో నాలుగు రోజుల్లో 1.73 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమం కింద జూన్ 25న ప్రారంభమైన ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 1.73 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్‌లు) పంపిణీ చేసినట్లు ఎన్నికల అధికారులు సోమవారం తెలిపారు. కేవలం నాలుగు రోజుల్లోనే 1.73 కోట్ల ఫారాల పంపిణీ పూర్తి చేసిన బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఎన్నికల సిబ్బంది చేసిన కృషిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుధర్శన్ రెడ్డి అభినందించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది.
ఈ సందర్భంగా బీఎల్‌వోలు నిర్దేశిత నిబంధనలు, బాధ్యతలను తప్పనిసరిగా పాటించాలని సుధర్శన్ రెడ్డి ఆదేశించారు. విధుల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు) బీఎల్‌వోలను ప్రోత్సహిస్తూ, నిర్ణయించిన గడువులోపు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.
ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా పూరించేలా బీఎల్‌వోలు మార్గనిర్దేశనం చేయాలని, ప్రతి ఓటరిని చేరుకునేలా 100 శాతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఈఓ సూచించారు. అదేవిధంగా ఫారాల డిజిటలైజేషన్‌కు అవసరమైన విధానాలపై బీఎల్‌వోలకు మరో విడత శిక్షణ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌వోలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌వోలు) ప్రతిరోజూ ఓటర్ల అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షించాలని, సామాజిక మాధ్యమాల్లో క్రమం తప్పకుండా సమాచారాన్ని నవీకరించాలని, అధికారులు నిర్వహించే క్షేత్రస్థాయి పర్యటనలను నమోదు చేయాలని సుధర్శన్ రెడ్డి సూచించారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటి సర్వే జూన్ 25న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 వేల మంది బూత్ స్థాయి అధికారులను నియమించారు. ఈ సర్వే జూలై 24 వరకు కొనసాగనుండగా, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అభ్యంతరాలు, విచారణల అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 1న ప్రకటించనున్నారు. ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమం మొత్తం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని సుధర్శన్ రెడ్డి తెలిపారు.
2025 నాటికి తెలంగాణలో మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, జూన్ 20 నాటికి 2.38 కోట్ల మంది వివరాలను మ్యాపింగ్ చేశారు. దాదాపు 90 లక్షల మంది ఓటర్ల డేటాలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్‌వోలు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు వాటిని సక్రమంగా పూరించేందుకు ఓటర్లకు సహాయం చేస్తున్నారు.
