
17 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆర్‌అండ్‌బీ శాఖలో కారుణ్య నియామకానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల (ఆర్&బీ) శాఖలో ఏకంగా 17 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఒక కారుణ్య నియామక దరఖాస్తుకు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో బాధిత యువకుడు కే. లక్ష్మణ్ కుమార్‌కు ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళవారం ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన లక్ష్మణ్‌ను మంత్రి అభినందించారు.
గతంలో కాకినాడ ఆర్ & బీ డివిజన్‌లో గ్యాంగ్ మజ్దూర్‌గా పనిచేస్తూ కే.వీ. అప్పారావు అనే ఉద్యోగి అనారోగ్యంతో మరణించారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ నియామకం 2009 నుంచి పెండింగ్‌లోనే కొనసాగింది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల విషయంలో బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగిందన్నారు.
17 సంవత్సరాలుగా తమ విజ్ఞప్తి పరిష్కారం కోసం ఎదురుచూసిన బాధిత కుటుంబం, చివరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డిలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
