Let's talk: editor@tmv.in
17న బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహ్మాన్ ప్రమాణస్వీకారం

17న బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహ్మాన్ ప్రమాణస్వీకారం

Shaik Mohammad Shaffee
16 ఫిబ్రవరి, 2026

బంగ్లాదేశ్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న (మంగళవారం) బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని మంత్రిమండలి ప్రమాణస్వీకారం చేయనుంది. జాతీయ పార్లమెంట్ (జాతీయ సన్సద్‌) కాంప్లెక్స్‌లోని ‘సౌత్ ప్లాజా’లో జరగనున్న ఈ వేడుకలో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ నూతన మంత్రుల చేత ప్రమాణం చేయించనున్నారు. సాధారణంగా అధ్యక్ష భవనమైన ‘బంగాభవన్’లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ కాగా, దానికి భిన్నంగా ఈసారి పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించనుండటం విశేషం.

సంప్రదాయానికి భిన్నంగా పార్లమెంట్‌లో వేడుక

సాధారణంగా బంగ్లాదేశ్‌లో మంత్రిమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం బంగాభవన్‌లోనే జరుగుతుంది. అయితే ఈసారి దేశంలోని రాజకీయ, పరిపాలనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ప్రాంగణాన్నే వేదికగా ఖరారు చేశారు. ఈ మేరకు అధ్యక్షుడు ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేయగా, ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

ప్రమాణస్వీకారంలో రాజ్యాంగ చిక్కులు

మంత్రిమండలి ప్రమాణం అనంతరం నూతన పార్లమెంట్‌ సభ్యుల ప్రమాణస్వీకార ప్రక్రియ జరగాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం సాధారణంగా ఈ బాధ్యత స్పీకర్‌దే. అయితే మాజీ స్పీకర్ షిరిన్ షార్మిన్ చౌదరి రాజీనామా చేసి అజ్ఞాతంలో ఉండటం, డిప్యూటీ స్పీకర్‌ జైలులో ఉండటంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని తృతీయ షెడ్యూల్‌ ప్రకారం.. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ అందుబాటులో లేని పక్షంలో అధ్యక్షుడు సూచించిన వ్యక్తి ఈ బాధ్యతలు నిర్వహించవచ్చు. అందుకనుగుణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్ కొత్త ఎంపీలతో ప్రమాణం చేయించనున్నట్లు తెలుస్తోంది.

పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు

కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడానికి ముందే పరిపాలనలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. ప్రస్తుత క్యాబినెట్‌ సెక్రటరీ షేక్ అబ్దుర్ రషీద్ నియామకాన్ని మధ్యంతర ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన స్థానంలో సిరాజ్ ఉద్దీన్ మియాను కొత్త క్యాబినెట్‌ సెక్రటరీగా నియమిస్తూ ప్రజాపరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిరాజ్ ఉద్దీన్ ప్రస్తుతం ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ వద్ద ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, తాను కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేశానని, శనివారం దానిని ఆమోదించారని రషీద్‌ స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ అభినందనలు.. స్పీకర్ పర్యటన

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. భారత్, చైనా, పాకిస్థాన్ సహా మొత్తం 13 దేశాల నేతలకు తాత్కాలిక ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. కాగా, ఎన్నికల్లో బీఎన్‌పీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్‌’ వేదికగా తారిఖ్‌ రెహ్మాన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన బీఎన్‌పీ.. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ, భారత్‌తో పరస్పర గౌరవంతో కూడిన దౌత్య సంబంధాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. "అందరితో స్నేహం.. ఎవరితోనూ విరోధం వద్దు" అనే నినాదంతో ముందుకు సాగుతామని బీఎన్‌పీ నేతలు వెల్లడించారు.

ప్రజాస్వామ్య నవశకం

2024లో చోటుచేసుకున్న భారీ ప్రజా నిరసనల అనంతరం, మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని దేశాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్‌పీ ప్రభంజనం సృష్టించింది. 300 స్థానాలున్న పార్లమెంట్‌లో 151 సీట్ల మ్యాజిక్‌ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసిన తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ తిరుగులేని మెజారిటీని దక్కించుకుంది. సుమారు 59 శాతం ఓటింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో ఇస్లామిస్ట్‌ జమాత్‌-ఎ-ఇస్లామీ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రభుత్వ మార్పుతో పాటు పాలనా సంస్కరణలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) కూడా విజయవంతం కావడంతో బంగ్లాదేశ్‌లో సరికొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కానుంది.