
రాజ్యసభ సభ్యులుగా 16 మంది ప్రమాణ స్వీకారం
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్, కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ , కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింగ్ మన్వీ సహా కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన మొత్తం 16 మంది సభ్యులు గురువారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఈ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ప్రమాణం చేశారు. మొత్తం 16 మందిలో ఎనిమిది మంది బీజేపీకి చెందినవారు కాగా, మిత్రపక్షాలకు చెందిన ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబిన్ బీహార్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజ్యసభకు వచ్చారు. ఆయన హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ నుంచే ఎన్నికైన కేంద్ర మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ తిరిగి రాజ్యసభలో ప్రమాణం చేశారు. అలాగే ఉపేంద్ర కుశ్వాహ (ఆర్‌ఎల్‌ఎమ్), శివేశ్‌కుమార్ (బీజేపీ) కూడా బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అస్సాం నుంచి తేరాస్ గోవల్ల, జోగెన్ మోహన్ (ఇద్దరూ బీజేపీ), అలాగే ప్రమోద్ బోరో (యూపీపీఎల్) ప్రమాణ స్వీకారం చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ (బీజేపీ), ఫూలో దేవి నేతం (కాంగ్రెస్), హర్యానా నుంచి కరమ్‌వీర్ సింగ్ బౌద్(కాంగ్రెస్), సంజయ్ బాటియా (బీజేపీ) కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింగ్వీ, వేం నరేంద్రరెడ్డి ప్రమాణం చేయగా, ఒడిశా నుంచి సుజీత్‌కుమార్ (బీజేపీ), హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ (కాంగ్రెస్) కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి హరివంశ్ నారాయణ్ సింగ్ నామినేషన్
రాజ్యసభ ఉపాధ్యక్ష (డిప్యూటీ ఛైర్మన్) పదవికి నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ గురువారం రాజ్యసభ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభలో కొత్త డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎగువ సభ నిబంధనల ప్రకారం ఈ ఎన్నిక జరగనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సభలో అధికారిక కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు. హరివంశ్ నారాయణ్ సింగ్ 2018 నుంచి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియడంతో ఆ పదవి ఖాళీ అయింది. అనంతరం ఏప్రిల్ 10న భారత రాష్ట్రపతి ఆయనను మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసినట్లు గెజిట్ ప్రకటనలో వెల్లడైంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 89(2) ప్రకారం రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్ ఉండటం రాజ్యాంగపరంగా అవసరం. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-ఆఫిషియో ఛైర్మన్‌గా ఉంటారు. ఆయన లేని సమయంలో సభ నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్ నిర్వర్తిస్తారు. సభలో క్రమశిక్షణను పరిరక్షించడం, నిబంధనలను అమలు చేయడం వంటి అధికారాలు కూడా డిప్యూటీ ఛైర్మన్‌కు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైనా, ఆ పదవిలో ఉన్నప్పుడు ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 17న జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలను ఇండియా కూటమి పార్టీలు బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
