
ఇంట్లో ఉండి.. 16 ఏళ్ళపాటు జీతం
ప్రపంచంలో విన్నవారికి ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో తాజా ఉదాహరణ జర్మనీ లో చోటుచేసుకున్న ఓ సంఘటన. సిక్ లీవ్ అంటే సాధారణంగా వారం పది రోజులు తీసుకుంటాం. కానీ ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఏకంగా 16 ఏళ్లు సిక్ లీవ్ తీసుకుంది. ఇంకా ఆ శ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కరోజు స్కూల్కి హాజరుకాకుండా కోట్ల రూపాయల జీతం అందుకుంది. ఈ వ్యవహారం బహిరంగం కావడంతో జర్మనీలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
నార్త్ రైన్ వెస్ట్ఫాలియాలోని ఒక కాలేజీలో పనిచేసే ఈ ఉపాధ్యాయురాలు 2009లో అనారోగ్య కారణంగా సెలవు తీసుకున్నారు. సాధారణంగా సిక్ లీవ్ కొద్ది రోజులు లేదా నెలలు ఉంటే, ఈమె మాత్రం పదహారేళ్లుగా కళాశాలకు రాలేదు. అయినప్పటికీ ప్రతి నెలా పూర్తి జీతం మాత్రం పొందారు.
ఆమెకు నెలకు దాదాపు 6,174 యూరోలు (సుమారు ₹6.3 లక్షలు) వేతనం లభిస్తోంది. అంటే సంవత్సరానికి దాదాపు 72,000 యూరోలు (₹74 లక్షలు) అవుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఒక మిలియన్ యూరోలు (₹11.6 కోట్లు) సంపాదించారు. ఒక్కరోజు క్లాస్రూమ్లో బోధించకుండా ఇంత మొత్తాన్ని జీతంగా పొందడం నిజంగా ఆశ్చర్యకరం.
అయితే ఇటీవల కొత్తగా నియమితులైన కాలేజీ ప్రిన్సిపాల్ ఆడిట్ చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఉపాధ్యాయురాలిని వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. కానీ తాను అన్యాయం ఎదుర్కొంటున్నానని చెబుతూ ఆ ఉపాధ్యాయురాలు కోర్టులో కేసు వేసింది. విచారణలో భాగంగా కోర్టు, కళాశాల యాజమాన్యం అభ్యర్థన సరైందని పేర్కొంది. వైద్య రుజువు చూపించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేకాదు, అనవసరంగా కోర్టును ఆశ్రయించినందుకు ఆ టీచర్ 2,500 యూరోలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసులో మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. పూర్తి సెలవులో ఉన్నప్పటికీ ఆ టీచర్ ఒక మెడికల్ స్టార్టప్ ప్రారంభించారు. దీంతో ఆమె ఆరోగ్యంపై అధికారులు మరింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో తీవ్రమైన అనారోగ్యం లేదని రుజువైతే, ఉద్యోగం మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పొందిన వేతనం, భవిష్యత్ పెన్షన్ సైతం కోల్పోవాల్సి ఉంటుంది.
