
16 ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా నిషేధం:మలేషియా సర్కార్ సంచలన నిర్ణయం
పిల్లలను సోషల్ మీడియా బారి నుంచి కాపాడాలని మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి 16 సంవత్సరాల లోపు వారికి సోషల్ మీడియా అకౌంట్లు నిషేధించాలని క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రి ఫహ్మీ ఫజిల్ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో పెరుగుతున్న సైబర్ బుల్లీయింగ్, మోసాలు, లైంగిక దౌర్జన్యాల నుంచి చిన్నారులను రక్షించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. వయస్సు నిర్ధారణ కోసం ఐడీకార్డు,పాస్‌పోర్ట్ ఆధారిత ఎలక్ట్రానిక్ చెక్స్ పద్ధతులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే నిషేధం ఎప్పుడు అమలవుతుందనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.
సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు
ఈ ఏడాది జనవరి నుంచే మలేషియాలో 8 మిలియన్లకుపైగా వినియోగదారులున్న ప్రధాన సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లకు లైసెన్స్ తప్పనిసరి చేశారు. అయితే వీటిలో లైసెన్స్ పొందిన సంస్థలు వయస్సు ధృవీకరణ, హానికర కంటెంట్ నియంత్రణ, పారదర్శకత నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా ప్రభావం
ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమలు కానున్న ఆస్ట్రేలియా చట్టం ప్రకారం 16 ఏళ్లు లోపు పిల్లలకు సోషల్ మీడియా పూర్తిగా నిషేధం విధించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలు ఈ వయసు నిబంధనలను ఉల్లంఘిస్తే 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు భారీ జరిమానా విధించవచ్చు.
యూరోప్‌లోనూ
డెన్మార్క్‌లో 15 ఏళ్లు లోపు వారికి సోషల్ మీడియా యాక్సెస్ నిషేధం ప్రకటించింది. నార్వేలోనూ 15 ఏళ్లు కనీస వయస్సు తప్పనిసరి చేసే చట్టంపై ముందుకు సాగుతోంది. మొత్తం మీద డిజిటల్ భద్రతపై ప్రపంచ దేశాలు కొత్త నిబంధనలపై అడుగులు వేస్తుండగా, మలేషియా తాజా నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది.
