Let's talk: editor@tmv.in
16 ఏళ్లలోపు పిల్లలకు ‘నో’ సోషల్ మీడియా: హోం మంత్రి అనిత

16 ఏళ్లలోపు పిల్లలకు ‘నో’ సోషల్ మీడియా: హోం మంత్రి అనిత

Panthagani Anusha
24 జనవరి, 2026

16 ఏళ్ల లోపు పిల్లలకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని పరిమితం చేయడం లేదా నిషేధించే అవకాశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఏర్పాటు చేసినట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పెరుగుతున్న సోషల్ మీడియా దుర్వినియోగం, పిల్లల మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ మంత్రుల బృందానికి ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వం వహిస్తారని ఇందులో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్‌తో పాటు ఇతర శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన ఉత్తమ నమూనాను రూపొందించడమే ఈ కమిటీ లక్ష్యమని వివరించారు.

కాగా ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియా వినియోగానికి కనీస వయస్సును 16 ఏళ్లుగా నిర్ణయిస్తూ చట్టం తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ చట్టంలో వయస్సు ధృవీకరణ బాధ్యతను నేరుగా సోషల్ మీడియా సంస్థలపై పెట్టడం విశేషం. ఈ నేపథ్యంతో ఆస్ట్రేలియా నమూనాతో పాటు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఇతర నమూనాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు.

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ఎలా నియంత్రించాలి? రాష్ట్ర స్థాయిలో ఎంతవరకు అమలు చేయగలం? అన్న అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తాం. ఇందులో పలు సిఫార్సులు ఉంటాయి. ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తాం,” అని మంత్రి స్పష్టం చేసింది.

మరోవైపు నిషేధం విధించాలా? లేక పరిమితులు పెట్టాలా? అన్న ప్రశ్నకు స్పందించిన మంత్రి నిషేధమా లేక పరిమితులా అనేది తర్వాతి విషయం. ముందుగా దుర్వినియోగాన్ని ఎలా నియంత్రించాలన్నదే మా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.

ఇందుకు ఫేస్‌బుక్‌ను ఉదాహరణగా ప్రస్తావించిన ఆమె చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల వయస్సును నమోదు చేసినప్పటికీ వారు నమోదు చేసే పుట్టిన తేదీ నిజమా కాదా అన్నది ధృవీకరించడం లేదని విమర్శించారు. పిల్లలు తప్పుడు వయస్సు నమోదు చేసి అకౌంట్లు తెరవడం వల్ల హానికరమైన కంటెంట్‌కు గురవుతున్నారని పేర్కొన్నారు. అందుకే వయస్సు నిర్ధారణకు సంబంధించి ఆధార పత్రాలను అప్‌లోడ్ చేసే విధానాన్ని సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా పిల్లలు, కిశోరులు సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వల్ల పలు సామాజిక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ వేధింపులు, అసభ్య కంటెంట్‌కు సులభ ప్రాప్తి, ఫేక్ న్యూస్ ప్రభావం, గేమింగ్,సోషల్ మీడియా వ్యసనం వంటి అంశాలు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రభుత్వాలను ఆలోచింపజేస్తున్నాయి.

భారతదేశంలో ఇప్పటివరకు సోషల్ మీడియా వినియోగానికి ప్రత్యేక వయస్సు పరిమితి చట్టపరంగా అమల్లో లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో దావోస్ పర్యటన సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఆయన ప్రకటనకు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ స్వాగతం పలికింది.

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడితో చర్చించిన అనంతరం మంత్రుల బృందం నెల రోజులలోపు తన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించనుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రాలకు ఉన్న పరిమిత అధికారాలు, కేంద్ర చట్టాల పరిధి దృష్ట్యా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ నివేదిక భవిష్యత్తులో జాతీయ స్థాయి విధానంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.