
సెప్టెంబర్ 16 నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈసారి స్థానికత నిబంధనల విషయంలో కొన్ని ప్రత్యేక సడలింపులు ఇచ్చింది. నాలుగు క్యాటగిరీలకు చెందిన విద్యార్థులు రాష్ట్రంలో చదవకపోయినా ప్రవేశాలకు అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
సాధారణంగా తెలంగాణ రాష్ట్ర కోటా (85 శాతం) కింద ప్రవేశం పొందాలంటే విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు, అంటే వరుసగా నాలుగు విద్యా సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిబంధనలో కొన్ని సడలింపులను తీసుకొచ్చింది వర్సిటీ. అదేమిటంటే, తెలంగాణ రాష్ట్రం వెలుపల నివసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆల్ ఇండియా సర్వీస్ (ఐఏఎస్,ఐపీఎస్, ఏఎఫ్ఎస్) కుటుంబాల విద్యార్థులు, రాష్ట్రానికి చెందిన రక్షణ రంగ సిబ్బంది/ మాజీ సైనికులు/ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల పిల్లలు, కేంద్ర కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థల్లో పనిచేస్తున్న రాష్ట్ర సిబ్బంది పిల్లల అడ్మిషన్లకు మినహాయింపులు కల్పించింది. అయితే కౌన్సెలింగ్ సమయంలో ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు ఆయా సర్వీసుల్లో ఉన్నట్లుగా, వారి ఉద్యోగ బదిలీల వివరాలతో కూడిన సర్టిఫికెట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్
నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ నీట్ యూజీ ర్యాంక్, అడ్మిట్ కార్డు, పదవ తరగతి, ఇంటర్ మర్క్స్ మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్, ధృవీకరణ కోసం నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు 17 నుంచి 19వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నీట్ ర్యాంక్, విద్యార్థి ఎంచుకున్న కళాశాల ప్రాధాన్యతలు, రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 85 శాతం సీట్లు రాష్ట్ర కోటా కింద, మిగిలిన 15 శాతం సీట్లు అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 50 శాతం సీట్లు రాష్ట్ర కోటా కింద, 35 శాతం సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద, 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధికారిక వెబ్‌సైట్ https://www.knruhs.telangana.gov.inను సందర్శించండి.
