
బీహార్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూకేటాయింపు
బీహార్ రాజధాని పాట్నాలో పవిత్ర గంగా నది తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి బిహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో సమావేశమై, స్థల కేటాయింపుపై తన కృతజ్ఞతలు తెలియజేశారని టీటీడీ బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటిచెప్పేందుకు, హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వివిధ రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలను టీటీడీ నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే బీహార్ ప్రభుత్వం పాట్నా సమీపంలో ఈ భారీ స్థలాన్ని కేటాయించడానికి ముందుకు వచ్చింది.
పాట్నాలో ప్రతిపాదిత శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం వసతులను నిర్మించనున్నారు. ఒక అత్యాధునిక కల్యాణ మండపం, పవిత్ర పుష్కరిణి, భక్తులకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలయ నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది. ఈ భేటీ సందర్భంగా సీఎం సామ్రాట్ చౌదరిని బి.ఆర్. నాయుడు శాలువాతో సత్కరించి, శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు. కాగా, గతంలో కూడా అసోం ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణార్థం కామరూప్ జిల్లాలో 10.3 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
