
1,466 మంది పోలీసులకు “కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్” అవార్డులు
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 2025 ఏడాదికి గానూ ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ అవార్డులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను అందజేయనుంది. దేశవ్యాప్తంగా 1,466 మంది పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు, తెలంగాణ నుంచి ఐదుగురికి ఈ జాబితాలో చోటు దక్కింది.
ఈ పురస్కారం ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024 ఫిబ్రవరి 1న ప్రారంభించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న, అంటే సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ పతకాలను ప్రకటిస్తారు.
ఈసారి ప్రకటించిన జాబితాలో సిఆర్పిఎఫ్ ప్రత్యేక డీజీ విటుల్ కుమార్, ఛత్తీస్‌గఢ్ అదనపు డీజీపీ వివేకానంద్, ఐజీ సుందరరాజ్ పట్టీలింగం వంటి అసాధారణ ప్రతిభ కనబరిచిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 20 మంది పోలీసు అధికారులకు ఈ గౌరవం లభించింది. వీరిలో ఐజీ కాశ్మీర్ విధి కుమార్ బిర్డీ, డీఐజీ సెంట్రల్ కాశ్మీర్ పాండే రాజీవ్ ఓంప్రకాశ్, ఎస్ఎస్పీ శ్రీనగర్ జి.వి. సుందీప్ చక్రవర్తి ఉన్నారు. వీరు ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను హతమార్చేందుకు చేసిన అత్యంత ప్రమాదకర కౌంటర్ టెరర్ ఆపరేషన్‌ను నడిపించారు. ఈ ఆపరేషన్‌లో వీరు ప్రదర్శించిన వ్యూహాత్మక నైపుణ్యం, నాయకత్వం, ధైర్యాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది.
ఒడిశాలో 17 మంది పోలీసు సిబ్బంది దర్యాప్తు, ప్రత్యేక ఆపరేషన్లలో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు సత్కరించబడ్డారు. వారిలో అనిల్ కుమార్ దాస్, హిమాంశు భూషణ్ స్వైన్, ధబలేశ్వర్ సాహు, గుండాలా రెడ్డి రాఘవేంద్ర ఉన్నారు. వీరు రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, 1,364 మంది సిబ్బందికి ప్రత్యేక ఆపరేషన్ల విభాగంలో, 93 మంది సిబ్బందికి దర్యాప్తు విభాగంలో, 9 మందికి ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో ఈ అవార్డు లభించింది.
2024లో మొదటిసారి ఈ పురస్కారం ప్రకటించినప్పుడు 463 మంది సిబ్బందికి ఇచ్చారు. కానీ ఈ ఏడాది 2025లో మూడు రెట్లు ఎక్కువగా 1,466 మంది సిబ్బంది ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు కేవలం గౌరవ సూచకం మాత్రమే కాదు, పటేల్ కలగన్న ఐక్య, సమర్థ భారత పరిపాలనా వ్యవస్థకు గుర్తింపుగా నిలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి
స్పెషల్ ఆపరేషన్ విభాగం: ఆకెపోగు లక్ష్మణరావు (హెడ్ కానిస్టేబుల్- తెలంగాణ), గిబిమోన్ జాకోబ్ (హెడ్ కానిస్టేబుల్- తెలంగాణ)
దర్యాప్తు విభాగం: అద్నాన్ నయీం అస్మి (ఎస్పీ, ఏపీ), వి. భీమా రావు (అడిషనల్ ఎస్పీ, ఏపీ), ఆర్జీ జయ సూర్య (డీఎస్పీ, ఏపీ), ఎండీ.నాసిరుల్లా (ఎస్ఐ, ఏపీ), చంద్రబాబు నగరి (ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ), ఉపేందర్ రావ్ జల (ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ), తిరుపతి వాసల (ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ)
ఫోరెన్సిక్ సైన్స్ విభాగం: ఫణి భూషణ్ బి (అసిస్టెంట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్)
