
140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతే మాకు ముఖ్యం: భారత్
దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఇంధన భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఆ దిశగానే భారత నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల శాఖ పరోక్షంగా తోసిపుచ్చింది. ప్రపంచ ఇంధన గమనానికి అనుగుణంగా జాతీయ ప్రయోజనాలే మార్గదర్శకంగా చమురు కొనుగోళ్లు సాగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక సంచలన పోస్ట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని, అమెరికా, వెనిజులా నుంచి అదనపు చమురు కొనుగోలుకు అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు రణధీర్ జైస్వాల్ బదులిస్తూ.. చమురు వనరులను వైవిధ్యీకరించుకోవడం తమ వ్యూహంలో భాగమని, అయితే అది మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
వెనిజులా చమురుపై ఆసక్తి
వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. భారత్‌కు వెనిజులాతో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని జైస్వాల్ గుర్తు చేశారు. వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటే వెనిజులా లేదా ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
రష్యా ఏమంటోంది?
ఈ పరిణామాలపై రష్యా కూడా స్పందించింది. రష్యాతో ఇంధన సహకారాన్ని భారత్ పునరాలోచిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. చమురు వ్యాపారం రెండు దేశాలకు లాభదాయకమని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్ స్థిరత్వానికి ఇది దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. రష్యా కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు కొనుగోలు చేయడం సహజమేనని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో జైశంకర్ పర్యటన
మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాలో పర్యటించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో నిర్వహించిన 'క్రిటికల్ మినరల్స్ మినిస్టీరియల్' సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంక్షోభంపై సమగ్రంగా చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. సహజ వనరులు, వ్యూహాత్మక ఒప్పందాల కోసం ఉద్దేశించిన 'ఫోర్జ్' చొరవకు భారత్ మద్దతు ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
వాణిజ్య ఒప్పందంపై స్పష్టత
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం భారతీయ వస్తువులపై టారిఫ్‌లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నారు. ఈ ఒప్పందం తుది దశలో ఉందని పీయూష్ గోయల్ తెలిపారు. త్వరలోనే దీనిపై ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నాయి. అయితే చమురు విషయంలో మాత్రం భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానానికే కట్టుబడి ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
