
గుజరాత్‌లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..14 మంది మృతి
గుజరాత్‌లో బుధవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సబర్కంఠ జిల్లాలో బస్సు–కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మహిళలు మృతి చెందగా, వల్సాద్ జిల్లాలో పికప్ వాహనం తిరగబడిన ప్రమాదంలో మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 14 మంది మృతి చెందగా, దాదాపు 40 మందికి పైగా గాయాలయ్యాయి. సబర్కంఠ జిల్లాలో అహ్మదాబాద్–ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ఒక కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని గాంభోయ్, హిమ్మత్నగర్ సివిల్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, బాధితులు అరవల్లి జిల్లా మోడాసా నుంచి హిమ్మత్నగర్ సమీపంలోని హుంజ్ గ్రామానికి ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వారు క్యాటరింగ్ బృందానికి చెందినవారని తెలిపారు. కారు అక్రమంగా యూ-టర్న్ తీసే ప్రయత్నంలో ఉండగా, వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వల్సాద్ జిల్లాలో
ఇదే రోజు వల్సాద్ జిల్లా కపరాడా ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పికప్ వాహనం అదుపుతప్పి తిరగబడటంతో ముగ్గురు పిల్లలు సహా ఎనిమిది మంది మృతి చెందారు. సుమారు 40 మంది గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వల్సాద్ ఎస్పీ వివరాల ప్రకారం, బాధితులు ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటనలపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
