
సెప్టెంబర్ 14 నుంచి వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం
జమ్మూకాశ్మీర్‌లోని ప్రసిద్ధ శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. గత 19 రోజులుగా నిలిచిపోయిన ఈ యాత్ర, సెప్టెంబర్ 14 ఆదివారం నుంచి పునఃప్రారంభమవుతుందని శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఎంవీడీఎస్‌బీ) ప్రకటించింది. గత నెల ఆగస్టు 26న త్రికూట కొండల్లోని అధ్కున్వారీలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో యాత్ర మార్గం పూర్తిగా దెబ్బతింది. ఈ విషాద ఘటనలో 34 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత భక్తుల భద్రత దృష్ట్యా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
పునరుద్ధరణ పనులు పూర్తి
యాత్ర మార్గంపై కొండచరియలు విరిగిపడటంతో పేరుకుపోయిన శిథిలాలను తొలగించడం, దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్ధరించడం వంటి పనులను బోర్డు అధికారులు పూర్తి చేశారు. ఈ పనులు విజయవంతంగా పూర్తి కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో యాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా యాత్ర పునఃప్రారంభం భక్తుల్లో ఆనందాన్ని నింపింది. కొవిడ్-19 ఆంక్షల తర్వాత ఇంత సుదీర్ఘ కాలం పాటు యాత్ర నిలిచిపోవడం ఇదే మొదటిసారి.
భక్తులకు మార్గదర్శకాలు
బోర్డు భక్తుల భద్రత కోసం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అదేమిటంటే, యాత్రికులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులను (ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్) వెంట తెచ్చుకోవాలి. ఆర్ఎఫ్ఐడీ ఆధారిత ట్రాకింగ్ కార్డులు తప్పనిసరి. ప్రతి భక్తుడు ఈ కార్డును కలిగి ఉండాలి. అలాగే యాత్రికులు నిర్దేశించిన మార్గాలలోనే ప్రయాణించాలి, క్షేత్ర సిబ్బందికి సహకరించాలి. మరిన్ని వివరాల కోసం భక్తులు శ్రీ మాతా వైష్ణోదేవి అధికారిక వెబ్‌సైట్ www.maavaishnodevi.orgను సందర్శించాలని బోర్డు అధికారులు సూచించారు.
