
14 ఏళ్ల తర్వాత.. మళ్లీ భారత్‌కు మెస్సీ
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాలతో పాటు మరొక నగరాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మెస్సీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ "గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025" పేరుతో భారతదేశంలో పర్యటించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ టూర్‌లో భాగంగా ఆయన మొదట కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. త్వరలోనే నాలుగో నగరాన్ని కూడా ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు.
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత పర్యటనపై మెస్సీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "భారతదేశం వంటి అద్భుతమైన, అందమైన దేశాన్ని ఈ డిసెంబర్‌లో సందర్శించడానికి నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను" అని మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. భారత్ చాలా ప్రత్యేకమైన దేశమని, 14 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పటి జ్ఞాపకాలు తనకి ఇంకా గుర్తున్నాయని తెలిపారు. అప్పటి అభిమానుల స్పందన అద్భుతమని కొనియాడుతూ.. కొత్త తరం అభిమానులను కలుసుకోవడానికి, ఫుట్‌బాల్‌పై తనకున్న ఇష్టాన్ని వారితో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మెస్సీ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. మొదటి రోజు కోల్‌కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ విగ్రహావిష్కరణ జరుగుతుంది. అక్కడే ఒక కొత్త స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యనేతలతో పాటు, స్థానిక క్రీడా, సినీ ప్రముఖులతో కూడా మెస్సీ భేటీ కానున్నారు. చివరిరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా లియోనెల్ మెస్సీ భేటీ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ పర్యటనకు ముందే, నవంబర్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా ప్రపంచకప్ విజేత జట్టుతో కలిసి కేరళలోని కొచ్చిలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం. ఫిఫా అంతర్జాతీయ విండోలో భాగంగా అర్జెంటీనా జట్టు ఈ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొంటారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
38 ఏళ్ల ఈ దిగ్గజం చివరిసారిగా 2011లో భారత్‌కు వచ్చారు. ఆ పర్యటనలో ఆయన తన అర్జెంటీనా జట్టుతో కలిసి కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులా జట్టుతో ఒక అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ మళ్లీ రానుండటంతో భారతీయ ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
