

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ప్రారంభం
భాగ్యనగరలో ఉన్న ఎల్బీ స్టేడియం సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రీడా ఉత్సాహంతో ఉరకలేసింది. “ఫిట్ లీడర్స్ – ఫిట్ స్టేట్” (నాయకులు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది) అనే నినాదంతో “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” ఘనంగా ప్రారంభమైంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే ఈ క్రీడా సంప్రదాయం గత 14 ఏళ్లుగా నిలిచిపోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని పునరుద్ధరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్‌బాల్ ఆడి అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రీడారంగంపై తన విజన్‌ను పంచుకున్నారు. ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడంతో పాటు, గచ్చీబౌలి క్రీడా ప్రాంగణాలను రూ. 700 కోట్లతో ప్రపంచస్థాయి వసతులతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 2034లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, వచ్చే మూడు నెలల్లోనే గచ్చీబౌలిలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. బేగంపేట హాకీ మైదానాన్ని కూడా ఆధునీకరిస్తామన్నారు.
హైదరాబాద్ ఫుట్‌బాల్ వైభవం - మెస్సీకి ఆహ్వానం
1950-60 దశకాల్లో భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచినప్పుడు, అందులో ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్ వారేనని సీఎం గుర్తుచేశారు. ఆ పాత వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం కొత్త క్రీడా పాలసీని తీసుకొచ్చిందన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించాం. 140 కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ దేశం నుంచి ఎంట్రీ స్థాయిలో కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. ఒలింపిక్స్‌లో సౌత్ కొరియా 30 స్వర్ణ పతకాలు సాధిస్తే, అందులో 16 గోల్డ్ మెడల్స్ అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీ దక్కించుకుంది. దక్షిణ కొరియాకు ఉన్న పట్టుదల మనకు లేకపోవడం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన అన్నారు. మనం కూడా అదే పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలోని ప్రతిభను వెలికితీసేందుకు 'సీఎం కప్' పోటీలు నిర్వహిస్తున్నామని, క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు మైదానంలో క్రీడాకారులుగా మారి పోటీ పడటం స్టేడియంలో పండుగ వాతావరణాన్ని తలపించింది.
