
ఒక్క కేసు కోసం 14 లక్షల ఫైళ్ల పరిశీలన!
సాధారణంగా ఏదైనా నేరంలో కేసు నమోదైతే విచారణ, తీర్పులు ఆలస్యం కావడం చాలా సామాన్యమైన అంశం. అధికారుల నిర్లక్ష్యం, కేసును పక్క దారి పట్టించే ప్రయత్నాల్లో భాగంగా ఈ జాప్యం జరుగుతూ ఉంటుంది. కేసులో ఆధారాలను పరిశీలించే క్రమంలోనూ ఇలా జరిగే అవకాశం ఉంది. ఇదే తరహాలో ఆస్ట్రేలియాలో ఓ కేసు పోలీసులకు సవాలు విసురుతోంది. ఈ కేసు విచారణ కోసం పోలీసుల ముందు ఏకంగా 14 లక్షల ఫైళ్లు పరిశీలనకు సిద్దంగా ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని ఓ చిన్నారుల సంరక్షణ కేంద్రంలో దారుణ ఘటన జరిగింది. ఇక్కడ పని చేసే ఓ వ్యక్తి లైంగిక దాడులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో జూలైలో సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వాటిని పరిశీలించగా పోలీసులు షాకయ్యారు. అతడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో దాదాపు 14 లక్షల ఫైళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ అధికారులు రంగంలోకి దిగి వాటిని విశ్లేషిస్తున్నారు. ఈ ఫైళ్లలో దాదాపు 5.5 లక్షల వరకు ఫోటోలే ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో లైంగిక వేధింపుల కేసుకు సంబంధించినవేమీ లేకపోయినా విచారణలో భాగంగా వాటిని పరిశీలించడం తప్పనిసరి. సదరు వ్యక్తి వివరాలు బయటకు రానివ్వడం లేదు. నిందితుడి వివరాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం అధికారులు, ఆయా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న వివరాలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదై రెండు నెలలు గడుస్తోంది. మరోవైపు పోలీసులు, అధికారులు పరిశీలించాల్సిన ఫైళ్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీర్పు రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
