

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
భారత పార్లమెంటరీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక కీలక రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 2029 నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, లోక్‌సభ స్థానాలను 816కు పెంచడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన '131వ రాజ్యాంగ సవరణ బిల్లు' శుక్రవారం నాటి ఓటింగ్‌లో అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది. దీనిపై అధికార పక్షం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మహిళా హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది.
లోక్‌సభలో ఈ కీలకమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఏప్రిల్ 16, గురువారం నాడు ప్రవేశపెట్టారు. బిల్లును సభ ముందు ఉంచుతూ, 2029 నాటికి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది ప్రభుత్వ దృఢ సంకల్పమని, ఇందుకోసం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్షాలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశాయి. మహిళా కోటా ముసుగులో ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా డీలిమిటేషన్ ప్రక్రియను ప్రవేశపెడుతున్నారని ఆరోపిస్తూ సభలో గందరగోళం సృష్టించాయి. ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్పుకు సహకరించాలని కోరినప్పటికీ, తొలి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇది చివరకు శుక్రవారం నాటి ఓటింగ్‌లో బిల్లు వీగిపోవడానికి దారితీసింది.
లోక్‌సభలో ఈ కీలక బిల్లుపై రెండు రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా, సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల చర్చకు సమాధానమిస్తూ, మహిళా రిజర్వేషన్ల అమలు కోసం నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ స్థానాలు కూడా పెరుగుతాయని వాదించారు. ప్రతిపక్షాల మద్దతు కోరుతూ లోక్‌సభ స్థానాల పెంపుపై అధికారిక సవరణలకు కూడా తాము సిద్ధమని హామీ ఇచ్చారు. అయితే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నాయకులు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళా కోటాను సాకుగా చూపి దేశ ఎన్నికల వ్యవస్థను, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ధ్వజమెత్తారు. నియోజకవర్గాల విభజనతో ముడిపెట్టకుండా నేరుగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం తెచ్చిన ఈ సవరణ బిల్లు కేవలం ఒక రాజకీయ కుట్ర అని విమర్శిస్తూ రెండు రోజుల పాటు సభలో గట్టిగా వాదించారు.
ఓటింగ్ గణాంకాలు
లోక్‌సభలో జరిగిన ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల (352 ఓట్లు) మద్దతు అవసరం. అయితే బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే రాగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అవసరమైన సంఖ్యాబలం లేక బిల్లు పడిపోయింది. మోడీ హయాంలో ఒక బిల్లు ఇలా ఓడిపోవడం ఇదే మొదటిసారి.
ఈ బిల్లు ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 816కు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 2011 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మహిళలకు 33 శాతం కోటా ఇవ్వడానికి వీలుగా స్థానాల పెంపును ఈ బిల్లులో పొందుపరిచారు.
విపక్షాల అభ్యంతరం - 'నార్త్-సౌత్' విభజన
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా లోక్‌సభ స్థానాల పెంపు వెనుక రాజకీయ కుట్ర ఉందని వారు ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్షాలు వాదించాయి.
అమిత్ షా ధ్వజ౦
బిల్లు వీగిపోయిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని మహిళలు ఈ అవమానాన్ని గమనిస్తున్నారని, 2029 ఎన్నికల్లో విపక్షాలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నియోజకవర్గాల మధ్య ఓటు విలువ సమానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే రేషనలైజేషన్ ప్రతిపాదించామని ఆయన స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ స్పందన
బిల్లు ఓటమిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఇది మహిళా సాధికారత కోసం తెచ్చిన బిల్లు కాదని, దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే కుట్ర అని విమర్శించారు. "ప్రధానికి నిజంగానే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంటే, 2023లో ఆమోదించిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, దానికి మేము పూర్తి మద్దతు ఇస్తాం" అని పేర్కొన్నారు. రాజ్యాంగంపై జరిగిన దాడిని తాము అడ్డుకున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఐక్య ప్రతిపక్షం - మల్లికార్జున ఖర్గే
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని సగం జనాభా అయిన మహిళలను అడ్డం పెట్టుకుని, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని మోడీ-షా ద్వయం చేసిన "దుష్ట ప్రయత్నాన్ని" ఐక్య ప్రతిపక్షం సమర్థవంతంగా అడ్డుకుందని ఆయన కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారత పేరుతో ఒక కుటిల రాజకీయ క్రీడకు తెరలేపిందని, అయితే వారి వ్యూహాన్ని 'ఇండియా' కూటమి పసిగట్టిందని ఖర్గే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కేవలం తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికే మోడీ ప్రభుత్వం లోక్‌సభ సీట్ల పెంపును తెరపైకి తెచ్చిందని ఖర్గే ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ప్రభుత్వ అసలు ఉద్దేశ్యం కాదని, డెలిమిటేషన్ ద్వారా దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చడమే వారి ప్రధాన లక్ష్యమని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పన్నిన ఈ కుట్రపూరిత వ్యూహం ఇప్పుడు వారి ముఖం మీదే కొట్టినట్లు అయిందని, రాజ్యాంగ విలువల పరిరక్షణలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి చారిత్రాత్మక విజయాన్ని సాధించాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ల పట్ల తమ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని ఖర్గే ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 2023లో ఆమోదించిన 'నారీ శక్తి వందన్ అధినియం' చట్టం ప్రకారం.. ఎటువంటి అదనపు షరతులు లేకుండా 2029 ఎన్నికల నుంచే 33 శాతం మహిళా కోటాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2023 నుంచే కాంగ్రెస్ ఈ డిమాండ్‌ను వినిపిస్తోందని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం అనవసరమని, ప్రధాని మోడీకి నిజంగా 'నారీ శక్తి'పై గౌరవం ఉంటే పాత చట్టాన్నే అమలు చేసి తన నిబద్ధతను నిరూపించుకోవాలని సవాలు విసిరారు.
2011 జనాభా గణన ఆధారంగా లోక్‌సభ సీట్లను గరిష్టంగా పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఖర్గే తిరస్కరించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సహకరించిన విపక్ష నాయకులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితం ప్రభుత్వ అహంకారానికి చెక్ పెట్టిందని, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే ఎటువంటి ప్రయత్నాలనైనా ప్రతిపక్షం గట్టిగా ప్రతిఘటిస్తుందని ఆయన హెచ్చరించారు.
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ
చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఉత్తర-దక్షిణ విభజన సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లను అనుమతించదని, అందుకే ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు. అయితే ఈ హామీలతో విపక్షాలు సంతృప్తి చెందలేదు.
వెనక్కి తగ్గిన ఇతర బిల్లులు
రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో, దానికి అనుబంధంగా ఉన్న 'డీలిమిటేషన్ బిల్లు' 'యూనియన్ టెరిటరీస్ లాస్ బిల్లు'లను కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఈ మూడు బిల్లులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున, ప్రధాన బిల్లు పడిపోవడంతో మిగిలిన వాటిని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభకు తెలిపారు.
ప్రధాని మోదీ పిలుపు
ఓటింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. మన 'నారీ శక్తి'కి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఓటు వేయాలని కోరారు. మహిళల మనోభావాలను దెబ్బతీయవద్దని ప్రార్థించినా, విపక్షాలు తమ పట్టు వీడలేదు.
ఈ మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు (ఏప్రిల్ 16-18) ఈ కీలక బిల్లు కోసమే నిర్వహించారు. బిల్లు వీగిపోవడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం ఈ ఓటమిని సవాలుగా తీసుకుంది. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టం చేసింది. రాజకీయంగా ఈ అంశం రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంది.
