
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం? 90 రోజుల్లో కొత్త చట్టం: సీఎం
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం పెను సవాలుగా మారుతోంది. పసి ప్రాయం నుంచే చిన్నారులు సోషల్ మీడియాకు బానిసలవుతుండటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 13 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు శుక్రవారం శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు.
తప్పుదోవ పడుతున్న భవిష్యత్తు
చిన్నారులు గంటల తరబడి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌లకు అతుక్కుపోవడం వల్ల వారి చదువు కుంటుపడుతోందని, కంటి చూపు మందగించడంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అనవసరపు కంటెంట్ వల్ల పిల్లలు తప్పుదోవ పడుతున్నారు. ఇది వారి భద్రతకు కూడా ముప్పుగా మారుతోంది. భావి తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని ఆయన పేర్కొన్నారు.
వయసు పరిమితిపై కసరత్తు
వచ్చే 90 రోజుల్లో దీనిపై ఒక స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ నిషేధ వయసు 13 ఏళ్లు ఉండాలా లేక 16 ఏళ్ల వరకు పెంచాలా? అనే అంశంపై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వైద్య నిపుణుల నుంచి ప్రభుత్వం సలహాలు స్వీకరించనుంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పూర్తిస్థాయి విధివిధానాలను ఖరారు చేయనున్నారు.
కర్ణాటక బాటలోనే ఏపీ
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఇప్పటికే 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో పయనిస్తుండటంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. పిల్లలు వర్చువల్ ప్రపంచంలో బందీలు కాకుండా ఆటపాటలతో శారీరకంగా, మానసిక ఆరోగ్యంగా పెరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
