
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా అవసరాల దృష్ట్యా పలువురు ఐఏఎస్, నాన్ కేడర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌పీఎల్-ఏ) శాఖ జారీ చేసిన జీవో ఆర్‌టీ నెం. 914 ప్రకారం మొత్తం 13 మంది అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు.
ఈ తాజా బదిలీలలో భాగంగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌ను నియమించారు. అలాగే ఇప్పటివరకు సీఎంఓలో సేవలందించిన అజిత్‌రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొత్త బాధ్యతలను అప్పగించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమితులయ్యారు.
విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఎండోమెంట్స్ శాఖ నుంచి అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించగా.. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత, హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్‌కు ఆ శాఖలోనే మరికొన్ని అదనపు బాధ్యతలను కేటాయించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ జాయింట్ ఎండీ అదే శాఖకు జాయింట్ సెక్రటరీగా కాత్యాయనీ దేవిని నియమించారు.
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే హెచ్‌ఎండీఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కె. చంద్రకళను నియమించారు. తెలంగాణ రెడ్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీని నియమించారు. ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీగా గంగాధర్‌కు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్‌గా టి.వెంకన్నను నియమించారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత కీలకమైన టూరిజం డైరెక్టర్‌గా కె.విద్యాసాగర్‌ను నియమించారు.
