Let's talk: editor@tmv.in
13న మెస్సీతో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి

13న మెస్సీతో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
2 డిసెంబర్, 2025

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం అర్జెంటీనా లియోనెల్ మెస్సీ భారత్‌ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ రావడం నేపథ్యంలో, డిసెంబర్‌ 13న జరగనున్న స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రారంభించే (కిక్ ఆఫ్ చేసే) అవకాశం ఉంది.ఈ మ్యాచ్‌ ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనా వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణను జోడించనుంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన తుది వివరాలు కొన్ని రోజుల్లో ఖరారు కానున్నాయని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ మ్యాచ్‌ను ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనుంది . ఈ మ్యాచ్‌లో మెస్సీ జెర్సీ నంబర్ 10, రేవంత్ రెడ్డి జెర్సీ నంబర్ 9లతో బరిలోకి దిగనున్నారు. ఫుట్‌బాల్‌ ఆటపై ప్రత్యేక ఆసక్తి కలిగిన రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కొంతమంది ఆటగాళ్లతో కలిసి సాధన చేయడం కూడా గమనార్హం. గత సంవత్సరం ఆయన హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులతో స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే.

డిసెంబర్‌ 1 నుంచి 13 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల పూర్తిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంలోనే డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ప్రతిపాదిత భారత ఫ్యూచర్‌ సిటీలో జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌’ కు ఆహ్వానాలు అందజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించనున్నట్లు అధికార ప్రకటనలో వెల్లడైంది. ఇక రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలతో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ ను కూడా ఈ వేడుకల సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నవంబర్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 'గోట్ టూర్ టు ఇండియా 2025' లో భాగంగా ఈనెల‌లో భారత్‌కు రానున్న ఆర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీని తెలంగాణలో స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నానని ప్రకటించారు. కోల్‌కతాలో జరగనున్న తొలి కార్యక్రమం అనంతరం మెస్సీ హైదరాబాద్‌లో పాల్గొననున్నారు.