Let's talk: editor@tmv.in
తెలంగాణలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
తెలంగాణలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
తెలంగాణలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

తెలంగాణలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

Gaddamidi Naveen
22 జూన్, 2026

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పలు కార్యక్రమాలలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా పాల్గొని యోగాసనాలు వేశారు.

కరీంనగర్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి యోగా భూమి గా గొప్ప గుర్తింపు లభించిందన్నారు. నేటి ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధులకు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఒక్కటే సరైన పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తమ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా అనేది మన ప్రాచీన భారతీయ వారసత్వంలో ఒక అంతర్భాగమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఇది శారీరక, మానసిక, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడానికి అద్భుతంగా తోడ్పడుతుందని, శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేస్తుందని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఒక అమూల్యమైన సాధనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

యోగాను ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం, ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధనలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగ అని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ సొసైటీ, హెల్తీ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులకు యోగా పరిచయం చేస్తున్నామని, యోగా గొప్పతనం ప్రతి ఒక్కరికీ తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్ శాఖ ద్వారా యోగా శిక్షణను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో యోగా నేడు ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ అనే నినాదంతో, మనమందరం నిత్యం యోగా సాధన చేస్తూ శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, మైదానాలు, పర్యాటక కేంద్రాలలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించారు.

ట్యాగ్‌లు
InternationalYogaDayYogaDay2026YogaForOneEarthOneHealthYogaForWellnessYogaForLifeYogaEverydayHealthyLifestyleMindBodySoul
తెలంగాణలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం - Tholi Paluku