
9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ
బీహార్ లో ఓటరు జాబితా సమగ్ర సవరణ చేపట్టిన తరువాత ఎలక్షన్ కమిషన్ దేశంలోని 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో దశ సమగ్ర ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్)ను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సోమవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ సవరణ కార్యక్రమం అండమాన్–నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమలు కానుంది.
తేదీల వారీగా షెడ్యూల్
• అక్టోబర్ 28 – నవంబర్ 3: ముద్రణ, శిక్షణా కార్యక్రమాలు
• నవంబర్ – డిసెంబర్ 4: ఇంటింటి ఓటరు గణన
• డిసెంబర్ 9: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
• డిసెంబర్ 9 – జనవరి 8, 2026: ఫిర్యాదులు, సవరణల దశ
• డిసెంబర్ 9 – జనవరి 31: విచారణ, ధృవీకరణ దశ
• ఫిబ్రవరి 7, 2026: తుది ఓటర్ల జాబితా విడుదల
ఈ 12 రాష్ట్రాలు, యుటీల ఓటర్ల జాబితాలను ఈ రాత్రి 12 గంటలకు (ఫ్రీజ్)నిలిపివేస్తారు. ప్రతి ఓటరుకి బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారమ్‌లు అందజేస్తారు. వీటిలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల వివరాలన్నీ ఉంటాయి. 2003 నాటి ఓటర్ల జాబితాలో ఎవరి పేరు లేదా వారి తల్లిదండ్రుల పేర్లు ఉన్నా, కొత్త పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు అన్నారు. వారి పేర్లు కాకపోతే, వారి తల్లిదండ్రుల పేర్లు జాబితాలో ఉంటే, వారు కూడా అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 నుంచి 2004 వరకు సర్ ఓటరు జాబితాను చూడాలనుకుంటే http://voters.eci.gov.in లో అందుబాటులో ఉంచారు.
ఆధార్ కార్డు అంశంపై స్పష్టత
సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్‌ను గుర్తింపు పత్రంగా మాత్రమే వినియోగించవచ్చని, అది పుట్టిన తేదీ, పౌరసత్వం లేదా నివాస ధ్రువీకరణ పత్రం కాదని సీఈసీ స్పష్టం చేసింది. ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 ఆధార్ నివాసం లేదా పౌరసత్వానికి రుజువు కాదని చెబుతోంది . ఆధార్ పుట్టిన తేదీకి రుజువు కాదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది.
మొదటి దశ ఆధారంగా మార్పులు
బీహార్‌లో జరిగిన తొలి దశ సవరణ అనుభవంతో ఈసారి ప్రతి ఇంటిని మూడు సార్లు బూత్ లెవల్ ఆఫీసర్లు సందర్శిస్తారు. ఓటర్లు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు ఫారాలు నింపవచ్చు.
పోలింగ్ బూత్‌లలో కొత్త నిబంధనలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, సర్ ప్రక్రియపై వారికి వివరిస్తారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సంతకం చేసిన 50 ఫారాలను సేకరించి వాటి ధృవీకరణ పత్రాన్ని బీఎల్వోలకు సమర్పించవచ్చు.
ఓటర్ల రద్దీని తగ్గించేందుకు ప్రతి పోలింగ్ బూత్‌లో గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేయనున్నట్టు తెలిపారు.అధిక జనసాంద్రత ఉన్న హై-రైజ్ భవనాలు, గేటెడ్ కాలనీలు, స్లమ్ ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఎందుకీ ఈ సవరణ?
వలసలు, ఒకరి పేరు రెండు చోట్ల నమోదవడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, విదేశీయుల పేర్లు చేర్చడం వంటి అంశాల వల్ల ఈ దేశవ్యాప్త ప్రత్యేక సవరణను దశలవారీగా చేపడుతున్నామని జ్ఞానేశ్ కుమార్ వివరించారు. ప్రతి అర్హుడైన ఓటరుని జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం ‘సర్’ ప్రధాన లక్ష్యం. ఈ నెల 22–23 తేదీల్లో న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
