
114 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం
ఫ్రాన్స్‌తో జీ-టు-జీ( రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం) విధానంలో 114 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. దాదాపు 13 ఏళ్ల క్రితం ఇలాంటి ఒప్పందం దాదాపు ఖరారైనప్పటికీ అమలు కాలేదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోలు మండలి (డీఏసీ) సమావేశంలో మొత్తం రూ.3.60 లక్షల కోట్ల విలువైన సైనిక సామగ్రి మూలధన కొనుగోళ్లకు ‘ అవసరమైన ఆమోదం’ (యాక్సెప్టెన్సీ ఆఫ్ నెసెస్సిటీ ) మంజూరు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
రాఫెల్ ప్రాజెక్టు వివరాలు
114 మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ) కొనుగోలు ఉంటుంది. అందులో 18 విమానాలను దసాల్ట్ ఏవియేషన్ నేరుగా ‘ఫ్లై అవే’ స్థితిలో సరఫరా చేస్తుంది. మిగిలినవి భారత్‌లో తయారీ అవుతాయి. దశల వారీగా 50శాతం కంటే ఎక్కువ స్వదేశీ భాగస్వామ్యం (ఇండిజినైజేషన్) ఉంటుంది. ఈ ఒప్పందం మొత్తం వ్యయం రూ.2.90 లక్షల కోట్లు నుంచి రూ.3.15 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే తుది ఒప్పందం కుదిరే ముందు దసాల్ట్‌తో ధర, ఆయుధ ప్యాకేజీ వంటి అంశాలపై చర్చలు జరగాల్సి ఉంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) తుది ఆమోదం ఇవ్వాలి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ భారత్ పర్యటనకు నాలుగు రోజుల ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
నేపథ్యం
2019లో భారత వైమానిక దళం 114 ఎంఆర్ఎఫ్ఏల కోసం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (ఆర్ఎఫ్ఐ) జారీ చేసింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద సైనిక కొనుగోలు ప్రోగ్రామ్‌లలో ఒకటిగా పేర్కొన్నారు. ఇతర పోటీదారుల్లో లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్-21, బోయింగ్ ఎఫ్/ఏ-18, యూరోఫైటర్ టైఫూన్ ఉన్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద ఫైటర్ స్క్వాడ్రన్ బలం అధికారికంగా ఆమోదించిన 42కు బదులుగా 31కు తగ్గింది. 2015లో మోడీ ప్రభుత్వం 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అవి ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి.
వైమానిక దళానికి ఇతర ఆమోదాలు
• రాఫెల్ ఎంఆర్ఎఫ్ఏ
• కాంబాట్ మిస్సైల్స్ (దూరప్రహార సామర్థ్యం పెంపు)
• ఎయిర్‌షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ ప్సూడో శాటిలైట్ (ఏఎస్-హెచ్ఏపీఎస్) – నిరంతర నిఘా, గూఢచారి, కమ్యూనికేషన్ అవసరాలకు
భూసేనకు
‘విభవ్’ యాంటీ ట్యాంక్ మైన్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ (ఏఆర్వీస్), టీ-72 ట్యాంకులు, బీఎంపీ-II వాహనాల ఓవర్‌హాల్
ఇవి శత్రు యాంత్రిక దళాల పురోగతిని అడ్డుకోవడంలో, పరికరాల సేవా కాలాన్ని పెంచడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
నౌకాదళానికి
4 మెగావాట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ ఆధారిత విద్యుత్ జనరేటర్లు (మేక్-I కేటగిరీ)
పీ8I లాంగ్ రేంజ్ మారిటైమ్ రికానైసెన్స్ విమానాలు, పీ8I విమానాల కొనుగోలు సుదూర యాంటీ-సబ్‌మరైన్ వార్‌ఫేర్, సముద్ర నిఘా, సముద్ర దాడి సామర్థ్యాలను పెంచుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మొత్తం ఆమోదాలు సాయుధ దళాల యుద్ధ సంసిద్ధతను బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలుగా మంత్రిత్వ శాఖ తెలిపింది.
